మీరు లేరు అంతా ఆగమాగం… KCR ముందు రైతుల కన్నీరు…
కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేందుకే వచ్చా పొలంబాటలో రైతులకు కేసీఆర్ భరోసా.
ధరావత్‌తండాలో ఎండిన పంటల పరిశీలన కొడుకు పెండ్లికి డబ్బుల్లేవని సత్తెమ్మ ఆవేదన.
తొమ్మిదేండ్లు చెరువులు,కుంటల్లో నీళ్లుండేది.బోర్లల్ల మంచిగ నీళ్లు ఉండేది. అవన్నీ నీతోనే పోయినయి.ఇప్పుడు పచ్చులోలిగే మారినం.పంటలన్నీ ఎండిపోయినయి.మళ్లీ కరువొచ్చింది.మేమెట్లా బతకాలి. అప్పులు చేసి తింటు న్నాం’ అంటూ రైతులు అంగోత్ సత్తెమ్మ, బానోత్ హేమానాయక్, పులుసోత్ ధన్‌సింగ్, గుగులోత్ లక్ష్మణ్, గుగులోత్ రాజమ్మ, కునుసోత్ జ్యోతి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. ఎండిన పంటల పరిశీలన కోసం కేసీఆర్ ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాకు వచ్చారు. గిరిజన రైతుల పంటలను పరిశీలించారు. అంగోత్ సత్తెమ్మకు చెందిన ఎం డిన వరి చేనులో దాదాపు అరగంట ఉన్నారు.అక్కడికి వచ్చిన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అంగోత్ సత్తమ్మ వరి పొలంలో రైతులతో కేసీఆర్ ముచ్చట ఇలా సాగింది.కేసీఆర్ వెంట ఎంపీ, మానుకోట బీఆర్‌ఎస్ అభ్య ర్థి మాలోత్ కవిత,మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,జీ జగదీశ్‌రెడ్డి,సత్యవతి రాథోడ్, వీ శ్రీనివాస్‌గౌడ్,మాజీ ఎంపీ సంతోష్‌కుమార్,మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు,సిరికొండ మధుసూదనాచారి,బస్వరాజు సారయ్య,మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్,పెద్ది సుదర్శన్‌రెడ్డి,రెడ్యానాయక్, బానోత్ శంకర్‌నాయక్,చల్లా ధర్మారెడ్డి,ఫైళ్ల శేఖర్‌రెడ్డి,గొంగిడి సునీత, గ్యాదరి బాలమల్లు,జడ్పీ చైర్మన్ శ్రీరాం సుధీర్‌కుమార్,కేతిరెడ్డి వాసుదేవారెడ్డి,లింగంపల్లి కిషన్‌రావు,బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
అంగోత్ సత్తెమ్మ : మీరు లేరు అంతా ఆగమైపోతాంది సారు. ఎనిమిది ఎకరాల్లో వేసిన వరి పంటకు నీళ్లు లేక కండ్ల ముందే ఎండింది.నెల కిందటే రెండు ఎకరాలు ఎండింది. పసులు మేసినయి. ఇప్పుడు ఆరు ఎకరాలు ఎండింది. పంట కాపాడుకునేందుకు రూ.1.82 లక్షలు పెట్టి నాలుగు బోర్లు వేసినా లాభం లేదు. పెట్టుబడికి తెచ్చిన రూ.3 లక్షల అప్పు మీద పడ్డది. నాలుగో తారీఖున నా కొడుకు రాజేందర్ పెండ్లి పెట్టుకున్నం. బిడ్డ పెండ్లి అప్పుడు అప్పు అయింది. ఈసారి పంట పండితే సంబురంగా లగ్గం చేయాలనుకున్న. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు సారూ.
(పెండ్లి కార్డు కేసీఆర్ చేతిలో పెట్టి కాళ్లమీద పడి వెక్కివెక్కి ఏడ్చింది)
కేసీఆర్: ఏడ్వద్దమ్మా. ధైర్యం చెడొద్దు. నేను వచ్చిందే మీ కోసం. మీకు అండగా నిలుస్తా. ఏం కాదు. మళ్లీ వచ్చేది మనమే. అందరం కలిసి పోరాటం చేద్దాం. నీకు రూ.5 లక్షలు ఇస్తా. కొడుకు పెండ్లి ధూంధాంగా చేసుకో.
(మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును పిలిచి.. ఇప్పుడు నేను ప్రకటించిన సాయం రేపే వీళ్లకు అందాలి. కొడుకు పేరు మీద రూ.2.50 లక్షలు, బిడ్డ పేరు మీద రూ.2.50 లక్షల చెక్కు ఇవ్వాలని చెప్పారు)
కునుసోత్ జ్యోతి: కాలువల్లో నీళ్లు రాలే. బోర్లు ఎండిపోయినయ్. కరెంటు సక్కగ వస్తలేదు. ఇప్పటికే నాలుగు సార్లు బోరు మోటర్ కాలిపోయింది. మీరు ఉన్నపుడు మంచిగ ఉండే సారు. ఇప్పుడు మళ్లీ ఎనుకటి కాలం వచ్చింది. పొయ్యిల పడ్డట్టు అయింది సారు మా పని. పంట పండితేనే బతుకుదెరువు. లేకుంటే మళ్లీ బతుకబోవుడే అయితది. ఏం చేయాలి సారు.
కేసీఆర్ :ఏం కాదమ్మా. మళ్లీ మనమే వస్తం. అందరం కలిసి పోరాటం చేద్దాం. మీకు తోడుగా నేనుంటా. మీ అందరి కష్టాలు చూసేందుకే పొలంబాట పట్టిన. మీ నష్టాన్ని చూస్తున్నా. బాధలు వింటున్న. ఏం చేయాలో అది చేద్దాం. అంతేగాని ధైర్యం చెడొద్దు. ఇలాంటి కష్ట సమయంలోనే నిలబడి ఉండాలి. అధికారులు వస్తారు. మీరు నష్టపోయినదంతా చూపించి రాయించండి.
గుగులోత్ రాజమ్మ: మంచినీళ్లు సుత సరిగ్గా ఇడుస్తలేరు సారు. తొమ్మిదేండ్లు ఇండ్లకు, పొలాలకు నీళ్లు మంచిగ ఇడిసిండ్లు. ఇప్పుడు మళ్లీ నీళ్ల బాధ మొదలైంది. పంటలు ఎండుతున్నయ్. అప్పులు పెరుగుతున్నాయ్ సారు. మా కష్టాలు ఎవరూ తీర్చాలి? ఇట్ల అయితే ఎట్ల సారు. మాకు దిక్కెవరు?
పులుసోత్ ధరంసింగ్:మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిగుండె సారు. ఇప్పుడు అంతా ఆగమైపోయింది. తొమ్మిదేండ్లు చెరువులు, కుంటల్లో నీళ్లుండేది. కాలువల్లో నీళ్లు ఇడిసేది. బోర్లల్ల మంచిగా నీళ్లు ఉండేది. అవన్నీ నీతోనే పోయినయి. ఇప్పుడు పచ్చులోలిగే మారినం. తొమ్మిదేండ్ల తర్వాత పంటలన్నీ ఎండిపోయాయి. రూ.2 లక్షల రుణమాఫీ లేదు. రైతుబంధు పూర్తిగా పడుతలేదు. అప్పులు చేసి తింటున్నం సారూ.
కేసీఆర్:మంచి నీళ్లు వస్తలేవని అధికారులకు చెప్పలేదా? ఏమంటున్నారు? ఎందుకు వస్తలేవో అడగండి. మీ కోసం దయాకర్‌రావు అడుగుతడు. ఆయన మీకు తోడుగా నీడగా ఉంటడు. అన్ని సమస్యలపై కలిసి నిలదీద్దాం.
బానోత్ హేమానాయక్: తొమ్మిదేండ్లు కాలువలతో చెరువు, కుంట నిండేది. బోర్లు, బావుల్లో నీళ్లు మస్తుగా ఉండేది. సంబురంగా ఎవుసం చేసుకున్నం సారు. కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనయి. భూమిలో నీళ్లు లోపటికి పోతున్నయి. పంటలు ఎండుతున్నయి. తాగేటందుకు కూడా నీళ్లు లేవు. మీరు ఉన్నప్పుడు ఏ బాధలు లేకుండే. మూడు నెలల్లోనే అంతా ఆగమైనం సారు.
కేసీఆర్ :మీరు పడుతున్న కష్టాలు పంటలు ఎండి జరిగిన నష్టాన్ని స్వయంగా చూసేందుకే మీ వద్దకు వచ్చిన. ఎండిన పంటలు అన్ని చూసిన తర్వాత ఏం చేయాలో, ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటం. ఏం కాదు. మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. రైతుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ ఏమైనా చేస్తాడు. మీ కష్టాన్ని దగ్గరుండి చూస్తున్న. అధైర్యపడొద్దు.