ఉరికించిన కేసిఆర్ ఉలిక్కిపడ్డా సర్కార్…!!

ఉరికించిన కేసిఆర్ ఉలిక్కిపడ్డా సర్కార్..

కేసీఆర్‌ ఎఫెక్ట్‌తన తదుపరి పర్యటన కరీంనగర్‌కే అని కేసీఆర్‌ చెప్పిన కొద్దిసేపటికే ఆదివారం 4.30కి బాహుబలి మోటర్ల గర్జన. ఎస్సారెస్పీ వరద కాల్వలోకి జలాల పంపింగ్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించిన దాదాపు 24 గంటల్లోనే సోమవారం సాయంత్రం 6.15కు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ గేట్లు ఎత్తివేత.

ఆదివారం సాయంత్రం 6 గంటలకు వ్యవసాయ మంత్రి తుమ్మల వివరణ. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కరువుపై సమీక్ష సమావేశం.

కేసీఆర్‌ ఎఫెక్ట్‌ కనిపించకుండా చేయడానికి కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సోమవారమంతా ఆపసోపాలు పడ్డారు. మంత్రులు, నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు.

11కి సాగునీటి మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌లో
3 గంటలకు మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లిలో..
4 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఢిల్లీలో..
4 గంటలకు మంత్రి జూపల్లి కొల్లాపూర్‌లో..
4.35 ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలో..
5.10 ఎమ్మెల్యే వేముల వీరేశం నల్లగొండలో..
5.30 మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోహెడలో..
5.35 మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో..

కాళేశ్వరంపై సీఎం, మంత్రులు చిల్లర డ్రామాలు చేస్తున్నరు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ఉన్న నీళ్లను సముద్రంలోకి వదిలిండ్రు. నీళ్లు ఎత్తిపోసేందుకు ఏమైంది? సమ్మక్క బరాజ్‌కు ఏమైంది? దేవాదుల నీళ్లు ఎందుకు పంప్‌ చేస్తలేరు?
– ఆదివారం జనగామ పర్యటనలో సర్కార్‌కు కేసీఆర్‌ ప్రశ్న

ఆదివారం ఉదయం 9 గంటలకు కేసీఆర్‌ బయల్దేరాడు. కరువు రైతుల గోసను తన కళ్లతో చూసేందుకు. భుజం తట్టి భరోసా చెప్పేందుకు!జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మూడు చోట్ల పర్యటన తర్వాత మధ్యాహ్నం 3.30కి ఆయన పర్యటన ముగిసింది. రైతులతో సంభాషణలో కాంగ్రెస్‌ సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం బయటపడింది. నీళ్లున్నా ఇవ్వని, ఇవ్వలేని నిర్వాకం బట్టబయలైంది.

కాంగ్రెస్‌ చేతకానితనం, కాళేశ్వరాన్ని వాడుకోకపోవడం వల్లే భూగర్భ జలాలు పడిపోయాయని తేటతెల్లమైంది. ఇక సూర్యాపేటలో కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించడమే తరువాయి. 3.30కి కేసీఆర్‌ పర్యటన పూర్తయితే.. ఆ తర్వాత కేవలం గంటకు, అంటే 4.30కి… కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లె వద్ద ఉన్న గాయత్రి పంప్‌హౌజ్‌లోని బాహుబలి మోటర్‌ గర్జిస్తూ ఆన్‌ అయింది.

లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి నీటి ఎత్తిపోత మొదలైంది. జల విస్ఫోటం జరిగినట్టు పంపులోంచి నీళ్లు గుమ్మటంలాగ ఎగిసిపడ్డాయి. ఎస్సారెస్పీ వరద కాల్వలోకి ఎగిరిదుంకాయి. ఉదయం 4 దాకా 12 గంటల పాటు మోటరు నడుస్తూనే ఉంది. 0.1 టీఎంసీ నీళ్లు కాల్వలోకి పరుగులు తీశాయి. భూగర్భ జలాలను పెంచి బోర్లను రీచార్జ్‌ చేసేందుకు ఉరకలెత్తాయి. తన తదుపరి పర్యటన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నే అని కేసీఆర్‌ దాదాపు 6 గంటలకు సూర్యాపేటలో ప్రకటించిన ఫలితమిది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించిన దాదాపు 24 గంటల తర్వాత.. సోమవారం సాయంత్రం 6.15కు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ గేట్లు తెరుచుకున్నాయి. కేఆర్‌ఎంబీ ఏమైనా అడ్డా? వాళ్లను అడిగి నీళ్లు తీసుకోవాలా? మన రైతుల కోసం తీసుకుంటే వాళ్లు ఆపగలరా? అని కేసీఆర్‌ గర్జించడంతోనే, గేట్లు తెరుచుకోవడమే కాదు; దాదాపు వెయ్యి క్యూసెక్కుల నీళ్లు కాల్వలోకి మళ్లాయి.

అర్ధరాత్రికి దాదాపు 2500 క్యూసెక్కుల నీళ్లు ప్రవహించినట్టు ఒక అంచనా. సాగర్‌ ఆయకట్టులో బోర్లలో నీళ్లు లేక బోరుమంటున్న, బోర్ల మీద బోర్లు వేసి అతలాకుతలమవుతున్న రైతులకు ఇది పెద్ద ఊరట. “మరి నిన్నటిదాకా లేవన్న నీళ్లు కేసీఆర్‌ కాలు బయటపెట్టంగనే ఎట్ల వచ్చినయ్‌? కేసీఆర్‌ నిలదీయంగనే కాల్వల్లకు ఉరికి ఎట్ల పారినయ్‌?” ఇదీ రైతులు వేస్తున్న ప్రశ్న. “వరద కాల్వలోకి నీళ్లు వదలండి. లెఫ్ట్‌ కెనాల్‌కు నీళ్లు ఇవ్వండి. దీనివల్ల భూగర్భం రీచార్జ్‌ అవుతుంది. కనీసం బోర్లతోనైన పంటలు పండించుకుంటం.. అని నిన్నటిదాకా ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకున్నం. ధర్నాలు చేసినం. అయినా ఎవరూ పట్టించుకోలేదు.

కేసీఆర్‌ కాలు బయటపెడితే తప్ప మా గోడు ఎవరూ విన్లేదు. ఇదే పని ముందు చేసి ఉంటే మా పంటలు ఎండకనే పోవు కదా” అని ఎస్సారెస్పీ వరద కాల్వ, సాగర్‌ ఎడమ కాల్వ కింది రైతులు వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టంటే మేడిగడ్డ లక్ష్మీ బరాజ్‌లో కుంగిన మూడు పిల్లర్లు కాదు. అది గొలుసుకట్టు ప్రాజెక్టు. దాన్ని వాడుకుంటే బాగుంటదని నిపుణులు నెత్తినోరు కొట్టుకున్నా ప్రభుత్వం వినలేదు. “నిన్న కేసీఆర్‌ గర్జించగానే కాళేశ్వరం బాహుబలి మోటర్లు ప్రారంభమయ్యాయి.

మరి పనికిరాదన్న కాళేశ్వరం ఇప్పుడెట్ల పనికొచ్చింది? ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ప్రభుత్వానికి నామోషీ ఎందుకు? ఇదే పద్ధతిలో ప్రాణహితలో వృథాగా పోతున్న నీటిని, దేవాదుల వద్ద ప్రవాహాన్ని ఒడిసిపడితే ఏం నష్టం” అని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద, రాజకీయం కోసం కాదు; రైతుల కోసం అంటూ కేసీఆర్‌ చేసిన పర్యటనతో, హెచ్చరికతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫేకులు, లీకులతో మసిబూసి మారేడుకాయ చేయవచ్చన్న ప్రయత్నం బెడిసి కొడుతున్నదన్న సంగతి దానికి అర్థమైంది.

అందుకే అనివార్య పరిస్థితిలో కాళేశ్వరం పంపుల్ని అది ఆన్‌ చేయక తప్పలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. కేసీఆర్‌ చెప్పేదాకా చేయకపోవడం ప్రభుత్వంలో ఉన్న అవగాహన లేమిని పట్టిచెప్పింది. కేసీఆర్‌ రైతు ఉద్యమంతో ప్రభుత్వం ఎంత బెదిరిపోయిందంటే, ఆదివారం సూర్యాపేటలో ఆయన ప్రెస్‌కాన్ఫరెన్స్‌ ముగియగానే వ్యవసాయ మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక సోమవారమైతే కేసీఆర్‌ ఎఫెక్ట్‌ను ఖండించడానికి మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు పోటీలు పడి ఎక్కడికక్కడ విలేకరుల సమావేశాలు నిర్వహించారు.

కరువు విపరిణామాలపై, ఎండుతున్న పంటలపై ఇప్పటిదాకా పెద్దగా దృష్టిపెట్టని సాగునీటి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఏకంగా సమీక్షా సమావేశమే నిర్వహించారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో, మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోహెడలో, మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో, మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లిలో, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మంలో, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో, వేముల వీరేశం నల్లగొండలో విలేకరుల సమావేశాలు నిర్వహించి కేసీఆర్‌ మాటల్ని ఖండించడానికి ప్రయత్నించారు.

కాంగ్రెస్‌ నేతలు మాటల్లో ఏమి చెప్పినా, సర్కారు చేతలు మాత్రం కేసీఆర్‌ ఎఫెక్ట్‌ను చెప్పకనే చెప్పాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. “కేసీఆర్‌ రైతుల దగ్గరకు వెళ్లే ఏమవుతుందోనన్న భయం కాంగ్రెస్‌ వారిలో కన్పించింది. అంతే తప్ప రైతుల పట్ల వారి చిత్తశుద్ధి కాదు. రైతుల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల వారికి నిజంగా ప్రేమ ఉంటే గోదావరి (ప్రాణహిత)లో వృథాగా పోతున్న నీటిని ఇప్పటికైనా ఒడిసిపట్టి ఎత్తిపోయాలి” అని ఒక సీనియర్‌ పాత్రికేయుడు సూచించారు.

ఇక నీళ్లు రావని, పంటలు ఎండిపోవడం తప్ప మరోమార్గం లేక దేవుడి మీదే భారం వేసిన రైతులు నీటి విడుదలతో కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. ఇది కచ్చితంగా కేసీఆర్‌ విజయమేనని రైతులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మొద్దనిద్ద నటిస్తుంటే కేసీఆర్‌ పర్యటించడం, ఆయన ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపడంతో వ్యవస్థలో చలనం వచ్చినట్టు చెప్తున్నారు. అందుకే రెండు కాలువలకు ఒకే రోజు నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు.

మరోవైపు, ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అన్నట్టుగా కేసీఆర్‌ తన పర్యటనలో భాగంగా చేసిన విమర్శలు, ఎత్తిచూపిన వ్యవస్థాగత లోపాలతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు అని కాంగ్రెస్‌ అసమర్థ పాలనా విధానం వల్ల తెచ్చిన కరువు అని కేసీఆర్‌ స్పష్టంగా, లెక్కలు, ఉదాహరణలతో సహా వివరించిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు, కేసీఆర్‌ పర్యటనతో బీజేపీలోనూ చలనం వచ్చింది. ఇన్నాళ్లూ రైతులను పట్టించుకోని, కనీసం నీళ్ల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని నేతలు ఇప్పుడు దీక్షలకు ఉపక్రమించారు.

5న రైతు జాగరణ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మంగళవారం కరీంనగర్‌లో రైతుదీక్ష పేరుతో ఓ కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేయకుండా, ఎండిన పంటలను పరిశీలించకుండా అకస్మాత్తుగా ఇప్పుడెందుకు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ పర్యటనతో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే తాము కూడా పోరాటం చేస్తున్నామని చెప్పుకునేందుకే బీజేపీ నాటకాలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్డెక్కినా పట్టించుకోలేదు…

ఎస్సారెస్పీ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం వరకు వరదకాలువ 122 కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఈ కాలువ పొడవునా 34 తూములు, 60 చెరువులున్నాయి. ఆ చెరువుల పరిధిలో 8 నుంచి 9వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. కాలువ పొడవునా ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వేలాది మంది రైతులు నేరుగా మోటార్లు పెట్టి సాగు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రారంభించిన నాటి నుంచి ఆ ఆయకట్టుకు లక్ష్యానికి అనుగుణంగా గత ప్రభుత్వం నీరందించింది.

వరద కాలువను జీవనదిలా తీర్చిదిద్దింది. కానీ ఈ ఏడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం వరద కాలువను పట్టించుకున్నది లేదు. నీళ్లు లేవంటూ వరద కాలువకు నీటిని విడుదల చేయలేదు. ఫలితంగా దానిపై ఆధారపడిన వేలాది ఎకరాలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలోనే వరద కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఎక్కడికక్కడ ధర్నాలకు దిగుతున్నారు. ఇటీవల కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద, కొండన్నపల్లి వరదకాలువ వద్ద జగిత్యాల-కరీంనగర్‌ జాతీయ రహదారిపై రైతులు ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ నీళ్లు లేవంటే లేవని అధికారులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం సైతం పట్టించుకున్నది లేదు.

ఇప్పటికీ సర్కారుది అవగాహన రాహిత్యమే…

నీటి యాజమాన్యంపై రాష్ట్ర సర్కారు ఇప్పటికీ ఒక అవగాహనకు రాలేదని, ఆకళింపు చేసుకోలేదని తెలిసిపోతున్నది. సాగునీటి విడుదల ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది ప్రభుత్వానికి అంతుబట్టడం లేదనేది సుస్పష్టంగా అర్థమవుతున్నది. అందుకు సుందిళ్ల బరాజ్‌ నిదర్శనంగా నిలుస్తున్నది. ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల సాకుతో, అవగాహన రాహిత్యంతో ఇప్పటికే అన్నారం బరాజ్‌ను ప్రభుత్వం ఖాళీ చేసింది. ఇప్పుడు అదే సాకుతో సుందిళ్ల బరాజ్‌ను కూడా ఖాళీ చేసేందుకు పూనుకున్నది.

బరాజ్‌లో దాదాపు 2 టీఎంసీల మేర నీరు ఉన్నది. బరాజ్‌లో నీటిని నిల్వ చేయవద్దని గత అక్టోబర్‌లో ఎన్‌డీఎస్‌ఏ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ నీటిని అలాగే ఉంచింది. సుందిళ్ల బరాజ్‌లో నీటిని విడుదల చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించింది. ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టగానే స్థానిక రైతులు వచ్చి అధికారులను నిలదీశారు. ప్రాజెక్టులో నీరు ఉండడం వల్లే భూగర్భజలాలు ఉండి బోర్లు పోస్తున్నాయని, నీటిని దిగువకు విడుదల చేస్తే బోర్లు ఎండి పంట చేతికి రాకుండా పోతుందని పట్టుబట్టారు.

దీంతో అధికారులు వెంటనే మళ్లీ నీటివిడుదలను నిలిపేశారు. ఈ ఒక్క సంఘటనతోనే రైతుకున్న సోయి కూడా ప్రభుత్వానికి లేదని అర్థమవుతున్నది. బరాజ్‌ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తే అది గోదావరిలోనే కలిసిపోతుంది, ఎవరికీ ప్రయోజనం లేదనేది అందరికీ తెలుసు. బరాజ్‌లో ఉంటేకనీసం పరిసర ప్రాంతాల్లోనైనా భూగర్భజలాలు ఉంటాయి. ఇదేమీ పట్టించుకోకుండానే నీటి విడుదలకు ప్రభుత్వం ఉపక్రమించడం దాని అవగాహన రాహిత్యానికి నిదర్శనం.