దేశ దర్మం కోసం BJP గూటికి చేరితే పునీతులే… 23 మంది ప్రతిపక్ష నేతలపై “నో యాక్షన్”
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు బిజెపి గూటికి చేరితే పునీతులైనట్లేనని మరోసారి నిర్థారణైంది. తాజాగా అవినీతి కేసులను ఎదుర్కొన్న 25 మంది నేతలు బిజెపి గూటికి చేరడంతో కేసుల నుండి ఉపశమనం పొందినట్లు మీడియా విచారణలో తేలింది.
బిజెపి కండువా కప్పుకుంటే చట్టం కూడా తన తీరుని మార్చుకుంటుందని స్పష్టమైంది.కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడి, సిబిఐలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. బిజెపిని ‘వాషింగ్ మెషీన్’ గా ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.
2014 నుండి, అవినీతి కేసులపై కేంద్ర ఏజెన్సీల నుండి దాడులను ఎదుర్కొంటున్న 25 మంది ప్రముఖ రాజకీయ నేతలు బిజెపిలో చేరారు. వీరిలో పది మంది కాంగ్రెస్ నేతలు, ఎన్‌సిపి, శివసేన (విభజనకు ముందు) పార్టీల నుండి నలుగురేసి చొప్పున, టిఎంసి నుండి ముగ్గురు. టిడిపి నుండి ఇద్దరు, ఎస్‌పి, వైఎస్‌ఆర్‌సిపి నుండి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.వీటిలో 23 కేసుల్లో,వారి రాజకీయ ఎత్తుగడలతో ఇడి,సిబిఐ నుండి ఉపశమనం పొందినట్లు విచారణలో తేలింది.
వీటిలో మూడు కేసులను మూసివేయబడ్డాయి. మరో 20 మందిపై కేసు విచారణను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఈ జాబితాలో ఉన్న ఆరుగురు రాజకీయ నేతలు సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు బిజెపిలో చేరడం గమనార్హం.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 95 శాతం మంది ప్రముఖ ప్రతిపక్ష నేతలు ఇడి, సిబిఐ దాడులను ఎదుర్కొన్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2022లో వెల్లడించింది.
వరుసగా 2022,2023 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం మహారాష్ట్ర రాజకీయాలను టార్గెట్ చేసింది. 2022లో ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనపై తిరుబాటు ప్రకటించి, మహా వికాస్ అఘాడీ (కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపి)లో ప్రభుత్వాన్ని కూల్చివేసింది. తర్వాత బిజెపితో చేతులు కలపడంతో షిండే, ఫడ్నవీస్ సిఎం, డిప్యూటీ సిఎంలుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.
మరుసటి ఏడాది ఎన్‌సిపిలో చీలికలు తీసుకువచ్చిన అజిత్ పవార్ వర్గం.. ఎన్‌డిఎ కూటమిలో చేరింది. దీంతో ఎన్‌సిపి నేతలు అజిత్ పవార్,ప్రఫుల్ పటేల్‌లపై కేసులను మూసివేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
25 మందిలో మహారాష్ట్రకు చెందిన 12 మంది ప్రముఖ నేతలు ఉన్నారు. వీరిలో 11 మంది 2022, ఆ తర్వాత ఏడాదిలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపికి చెందిన నలుగురితో సహా బిజెపి తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.
ఎపిలో ‘అవినీతి మార్కు’ ని ఎదుర్కొన్న నేతలు
ఈ 25 మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నేతలు బిజెపిలో చేరి అవినీతి మార్కుని వదిలించు కున్నారు. వీరిలో టిడిపి నుండి ఇద్దరు, వైసిపి నుండి ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ఎపిలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. టిడిపి, వైసిపిల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బిజెపిలో చేరిన సుజనాచౌదరి, సిఎం రమేష్, కె. గీతలను ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులుగా బిజెపి ప్రకటించింది.
రూ.100 కోట్ల నగదు అవతవకలు జరిగాయంటూ టిడిపి ఎంపిగా ఉన్న సిఎం రమేష్‌కి చెందిన కంపెనీలపై 2018 అక్టోబర్‌లో ఐటి శాఖ దాడులు జరిపింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ బిజెపి ఎంపి జివిఎల్.నరసింహారావు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. భారీ ఆర్థిక కుంభకోణాలతో ‘ఆంధ్రా మాల్యాలు’గా పేరు గడించినందుకు ఆయనను ఎంపిగా తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే 2019 జూన్‌లో సిఎం రమేష్ బిజెపి తీర్థం పుచ్చుకోవడంతో ఆయనపై ఐటి దాడులు నిలిచిపోయాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపి అభ్యర్థిగా బరిలోకి దిగారు.
మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపి సుజనాచౌదరిపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బిసిఇపిఎల్) సుజనా చౌదరికి చెందినవని, బ్యాంకుల కన్సార్టియం నుండి మోసపూరితంగా రూ. 360 కోట్లకు పైగా రుణాలు పొంది, డిఫాల్ట్ చేసిందని ఎఫ్‌ఐఆర్‌లు పేర్కొన్నాయి. 2016లో ఇడి కేసు నమోదు చేయగా, 2018 అక్టోబర్‌లో ఆయన కంపెనీలపై ఇడి దాడులు చేసింది. 2019 ఏప్రిల్‌లో రూ.315 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసుకుంది.
చార్జిషీటు నమోదైన అనంతరం 2019 జూన్‌లో బిజెపి కండువా కప్పుకోవడంతో ఈ కేసు తిరిగి విచారణకు వెళ్లింది. ప్రస్తుతం సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగారు.
వైసిపికి చెందిన కె.గీతను మార్చి 28న బిజెపి అరకు అభ్యర్థిగా ప్రకటిచింది. 2015 వైఎస్‌ఆర్‌సిపి ఎంపిగా ఉన్న సమయంలో వాస్తవాలను తప్పుగా చూపి, రూ.42 కోట్ల రుణాలు తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారంటూ ఆమె సంస్థ విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదైంది. గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావులపై 2015లో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది.
2019 జులైలో బిజెపిలో చేరారు. దీంతో 2022 సెప్టెంబర్‌లో ప్రత్యేక కోర్టు ఇరువురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ వెంటనే తెలంగాణ హైకోర్టు జైలు శిక్షపై స్టే విధించడంతో పాటు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో హైకోర్టు జైలు శిక్షపై మరోసారి స్టే విధించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు స్టేను సిబిఐ సవాలు చేసింది.
https://t.me/NewsbyNaveen