మాదాపూర్ :
ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, రామచంద్రాపురం పోలీసులు కలిసి రట్టు చేశారు. ఇద్దరు సోదరులతోపాటు బెట్టింగ్‌లో పాలుపంచుకున్న మరో ఇద్దరిని అరెస్టుచేసి రూ.37.84 లక్షలు నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు…
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధి బీరంగూడలో ఉంటున్న మొగిలిగిద్ద రామకృష్ణగౌడ్(30) స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారైన ఇతని సోదరుడు ఉపేందర్‌గౌడ్(40)తో కలిసి జల్సాలకు అలవాటుపడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దిల్లీ కేంద్రంగా సోనూ అనే వ్యక్తి తయారుచేసిన నైస్ 7777.ప్రో అనే వెబ్‌సైట్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్ సాగిస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగులు నిర్వహించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం సోదరులిద్దరితోపాటు బెట్టింగ్‌లో పాలుపంచుకున్న గాజులరామారానికి చెందిన తలారి శ్రీనివాస్(38), బండి వినయ్‌కుమార్ (44)లను పోలీసులు అరెస్టుచేశారు. రూ.37.84 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సోనుతోపాటు బెట్టింగ్‌లో పాలుపంచుకున్న చందానగర్‌కు చెందిన అంజి, పటాన్‌చెరుకు చెందిన చంద్రం, కూకట్‌పల్లికి చెందిన దొర పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు……