తాగునీటి తప్పిదాలపై జలమండలి కన్నెర్ర ఇటీవల ఇద్దరు లైన్మెన్ల సస్పెన్షన్

డబ్బులు ఇచ్చే కాలనీలకు అధికంగా నీటి సరఫరా మిగిలిన ప్రాంతాలకు అరగంటే పంపిణీ విజిలెన్స్ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ.

హైదరాబాద్ సిటీ :

జలమండలి ప్రతి రోజూ 500ఎంజీడీల నీటిని నగరవాసులకు సరఫరా చేస్తోంది. సక్రమంగా అందిస్తే అన్ని ప్రాంతాలకు తాగునీటిని ఇబ్బంది లేకుండా పంపిణీ చేయొచ్చు. వేసవిలో తాగునీటి వినియోగం ఒక్కసారిగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో గరిష్ఠ వేగంతో సరఫరా కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నతాధికారులతో నగరంలో పరిస్థితిపై సమీక్ష చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా తాగునీరు అందడం లేదన్న ఫిర్యాదులు రాకూడదని స్పష్టంచేశారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్‌ రెండుమూడుసార్లు జలమండలి కార్యాలయానికి వెళ్లి అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్ష చేశారు.

బుక్‌ చేసుకున్న నాలుగైదు రోజులకుగానీ ట్యాంకర్లు రావడం లేదన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు.

ట్యాంకర్ల సంఖ్య పెంచి రాత్రిళ్లు కూడా సరఫరా చేపట్టాలని ఆదేశించారు.

దీంతో చాలా ప్రాంతాల్లో ట్యాంకర్లతో  సరఫరా చాలా వరకు మెరుగుపడింది.

ఇదే సమయంలో, తమ ప్రాంతంలో రోజు విడిచి రోజు ఇచ్చే తాగునీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదన్న ఫిర్యాదులు చాలా ప్రాంతాలనుంచి అందాయి. దానకిషోర్‌ ఆదేశాలతో జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి.. మొత్తం వ్యవవ„రంపై విజిలెన్సు విచారణకు ఆదేశించారు.

విచారణ చేసిన అధికారులు ఆ ఫిర్యాదుల్లో నిజం ఉన్నట్లు తేల్చారు. చందానగర్‌లో ఒక లైన్‌మెన్‌ ఒక ఏరియాలో రెండు గంటల పాటు, మరో ఏరియాలో 20 నిమిషాలపాటే నీటిని సరఫరా చేస్తున్నారు.

రెండు గంటల సరఫరాకు సంబంధిత కాలనీల్లోని కొంతమంది వద్ద భారీగా వసూళ్లు చేస్తున్నట్లు తేలింది.

ఇదే పరిధిలో మరో లైన్‌మెన్‌ కూడా అక్రమాలకు తెరతీశారని విచారణలో వెలుగుచూసింది. ఈ ఇద్దరు లైన్‌మెన్లను రెండురోజుల కిందటే సస్పెండ్‌ చేశారు. మరో 20మంది తీరుపై విచారణ చేస్తున్నారు. మహా నగరంలో దాదాపు 700 మంది లైన్‌మెన్లు ఉన్నారు.

ఎండాకాలం వచ్చిందంటే ఇందులో కొంతమంది లైన్‌మెన్లు రూ.లక్షల్లో వసూలుచేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీలకు అధికంగా నీటిని సరఫరా చేస్తున్నారు. అందుకు నెలకు రూ.లక్షల్లోనే వసూలు చేస్తున్నారని తెలిసింది. మరికొన్ని చోట్ల డబ్బులిచ్చే కాలనీలవారికి అధికంగా సరఫరా చేస్తున్నారు.

మిగిలిన కాలనీలకు పావుగంటో, అరగంటో మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఆయా చోట్ల ఎవరికీ నీళ్లు సరిపోవడం లేదు. మెహిదీపట్నం, అత్తాపూర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సికింద్రాబాద్‌, మాదాపూర్‌, ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలానే జరుగుతోందని చెబుతున్నారు.

అందుతున్న ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ చేయించాలని జలమండలి అధికారులు నిర్ణయించారు. తప్పుంటే లైన్‌మెన్‌, సంబంధిత అధికారులపై వేటు వేయాలనుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో డీజీఎం స్థాయినుంచి కిందిస్థాయిలో అధికారులకు కూడా లైన్‌మెన్ల అక్రమాలతో సంబంధాలున్నాయన్న ఆరోణలు వినిపిస్తున్నాయి.

దీనిపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు……