తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన 14 ఏళ్ల బాలుడు.
పదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన అత్తమామల వద్దే ఉంటున్న కోడలు.
అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు.
శనివారం రాత్రి మరోమారు గొడవ.
అది చూసి నానమ్మ చాతీలో కత్తితో పొడిచిన మనవడు.
పరారీలో ఉన్న బాలుడి కోసం పోలీసుల గాలింపు.
తల్లితో తరచూ గొడవ పడుతోందన్న కారణంతో 14 ఏళ్ల బాలుడు నానమ్మను కత్తితో పొడిచి చంపేశాడు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. పదేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి భార్య తన ఇద్దరు కుమారులతో అత్తమామల వద్దే ఉంటోంది.
ఇటీవల తరచూ అత్తమామలతో గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. ఇది చూసిన మనవడు (14) నానమ్మపై కోపంతో కత్తితో ఆమె చాతీలో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమెను హనుమకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నారు.