మల్లన్న సాగర్ నీళ్లు వాడుకునుడెట రూపాయలు 1.30 కోట్లతో కొత్త పైప్ లైన్

మల్లన్న సాగర్ నీళ్లు వాడుకునుడెట రూపాయలు 1.30 కోట్లతో కొత్త పైప్ లైన్

బీఆర్ఎస్ హయాంలో మిడ్ మానేరు నుంచి తరలింపు ప్రస్తుతం 9 .7 టీఎంసీల నిల్వ వినియోగించుకునేందుకు సర్కారు ప్లాన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంప్ హౌజ్ కు మళ్లించేలా పనులు 200 మీటర్ల పైప్ లైన్ కోసం రూ.1.30 కోట్ల తో టెండర్లు.

సిద్దిపేట :

మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరలించి, నిల్వ చేసిన సుమారు 10 టీఎంసీల నీళ్లను వినియోగించుకోవడంపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సిద్దిపేట మున్సిపాలిటీతోపాటు గజ్వేల్, జనగామ నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ 130ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) సప్లై చేస్తున్నారు. ఎండాకాలమంతా సరఫరా చేసినా ఒక టీఎంసీకి మించి వాడుకునే పరిస్థితి లేదు.

కానీ, హైదరాబాద్లో నీటి అవసరాలు ఉన్నా ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు గత సర్కారు చేయలేదు. దీంతో మల్లన్నసాగర్ నుంచి కొత్తగా పైపులైన్ వేసి, దానిని ఎల్లంపల్లి నుంచి వచ్చే మెట్రో వాటర్ పైపు లైన్కు కనెక్ట్ చేసి హైదరాబాద్కు 100ఎంఎల్డీ తరలించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు 200 మీటర్ల పైప్ లైన్ నిర్మాణం కోసం రూ.1.30 కోట్లతో ఇటీవల టెండర్లు పిలిచారు. ఇలా తరలించినా మల్లన్నసాగర్లో ఇంకా 7 నుంచి 8టీఎంసీలు మిగిలే ఉంటాయని ప్రాజెక్టు ఇంజినీర్లు చెప్తున్నారు.

హైదరాబాద్కు ఒక టీఎంసీ నీరు తరలించే ఏర్పాట్లు..

గత ఆగస్టు నెల నుంచి వివిధ దశల్లో మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్కు ఎత్తిపోసిన నీళ్లు రిజర్వాయర్లో 9.7 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మిడ్మానేరు మాత్రం పూర్తిగా అడుగంటి అందులో మునిగిన పదికిపైగా గ్రామాలు తేలాయి. ప్రస్తుతం మల్లన్నసాగర్ నుంచి మంగోలు ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గజ్వేల్, జనగామ నియోజకవర్గాలకు 130 ఎంఎల్డీ నీటిని శుద్ది చేసి తరలిస్తున్నారు.

ఈ ఎండాకాలమంతా వాడుకున్నా ఒక టీఎంసీకి మించదు. మల్లన్నసాగర్లో ఎవాపరేషన్లాసెస్(ఆవిరి నష్టాలు) ఎక్కువ. మరోవైపు హైదరాబాద్లో నీటి కష్టాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్ నీటిని హైదరాబాద్తరలించేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మంగోలు ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ 270 ఎంఎల్డీ కావడంతో రెండో మోటారును వినియోగంలోకి తెచ్చి, 100 ఎంఎల్డీని లిఫ్ట్ చేయనున్నారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం గరిష్టంగా ఒక టీఎంసీ నీటిని మల్లించనున్నారు.

రూ.1.30 కోట్లతో కొత్త పైప్లైన్…

మంగోలు ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి కొండపాక హెచ్ఎండబ్ల్యూ పంప్ హౌజ్లోకి మళ్లించేందుకు ప్రత్యేకంగా పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 మీటర్ల పైప్లైన్ను రూ.1.30 కోట్లతో నిర్మించేందుకు హెచ్ఎండబ్ల్యూఎస్(హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ) ఆధ్వర్యంలో టెండర్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలోనే ఆర్ డబ్ల్యూఎస్, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి కొండపాక పంప్ హౌజ్ నుంచి బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నీటిని గజ్వేల్, ఆలేరు, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ఆ పాత నెట్వర్క్నే ఉపయోగించుకోవాలని నిర్ణయించడం విశేషం.

పాత నెట్వర్క్ వాడుకుంటాం..

మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తాగు నీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పాత నెట్ వర్క్ ద్వారా మంగోల్ ట్రీట్ మెంట్ ప్లాంట్ మీదుగా కొండపాక హెచ్ఎండబ్ల్యూఎస్ పంప్ హౌజ్ కు మళ్లిస్తాం. ఇందుకోసం కొత్తగా 200 మీటర్ల మేర 1.30 కోట్ల వ్యయంతో పైప్ లైన్ వేస్తున్నాం. ఈ పనులకు సంబంధించి టెండర్లు స్వీకరిస్తాం. పది రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రతి రోజు 100 ఎంఎల్ డీ నీటిని హైదరాబాద్కు తరలిస్తాం.

ఎం.బ్రిజేశ్, ఈఈహెచ్ఎండబ్ల్యూ