ఏవి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సుప్రీంకోర్టు రద్దు…

ఏవి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సుప్రీంకోర్టు రద్దు…

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ”నాకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని అప్పీల్ చేశాను. హైకోర్టు దాన్ని స్వీకరించి సస్పెన్షన్‌ను రద్దు చేపింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని ఖరారు చేసింది.ఇదంతా జరగడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కేసు ఓడిపోవడానికి కారణం ఎవరు? ఏ బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇలా చేశారు? ఈ సైకో కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు? ఏ శాడిస్ట్ కళ్ళల్లో ఆనందం కోసం ఇలా చేశారు?” అని ప్రశ్నలు గుప్పించారు.

”ప్రభుత్వాలు, చీఫ్ సెక్రటరీలు వస్తుంటారు పోతుంటారు. నా సర్వీస్‌లో 10 నుంచి 15 బ్యాచ్‌లు చూశా. కానీ ప్రజలు శాస్వతం. న్యాయం శాస్వతం, ప్రజల శాసనం శాస్వతం. నేను లోకల్ ఎవరినీ వదిలి పెట్టను”అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా యన ధ్వజమెత్తారు. ”అందరూ రాసిన ఒకటే వ్యాసం. అదంతా ఆవుపైన వ్యాసమే. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అదే వ్యాసం. అసలు రిపోర్ట్‌లు చదవరా. కామాలు, ఫుల్‌స్టాప్‌లు కూడా సరిచూసుకోరా.. మార్చరా.. మీకు వృత్తి నైపుణ్యం లేదా. అసలు కొనుగోలే జరగని దానిలో అవినీతి ఎలా అని ఎవరూ ప్రశ్నించరా” అంటూ మండిపడ్డారాయన.

అసలు సస్పెండ్ ఎందుకయ్యారు

ఏబీ వెంకటేశ్వరరావు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 ఎన్నికల సమయంలో ఆయనపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల సంఘం.. వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో 155 స్థానాలు గెలిచి వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఆ తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బదిలీ చేసి కొత్తగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇంతలో నిఘా పరికరాల కొనుగోలులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ అభియోగాలు వెళ్లువెత్తాయి. వాటి ఆధారంగానే 8 ఫిబ్రవరి 2020న ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

సస్పెన్షన్ ఎత్తేసిన హైకోర్టు

ఏబీ వెంకటేశ్వరావు పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిగిపి వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆయనను వెంటనే విధుల్లకి తీసుకోవాలంటూ ఆదేశించింది. అయినా వెనకడుగు వేయని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏబీని డిస్మిస్ చేయాలంటూ 16 డిసెంబర్ 2021న కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగా ఆయనను డిస్మిస్ చేయకుండా రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ కేసులో నేడు తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. ఏబీపై విధించిన సస్పెన్షన్‌ను పూర్తిగా రద్దు చేసింది.