అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే

అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే

సామాజిక మాధ్యమాల పరిశీలనకు కమిటీ

చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం… రెచ్చగొట్టే వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన వ్యక్తులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టటానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు వాటి పరిశీలనకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సామాజిక మాధ్యమాల తీరుతెన్నులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం చరవాణి, సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రధాన పక్షాల అభ్యర్థులు వాటిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దీంతో వాట్సాప్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో ఫాలోవర్లు ఎక్కువ ఉన్న వారిని ఆయా పార్టీల నేతలు లోబరుచుకుంటున్నారు. ప్రత్యర్థులపై పోస్టులు పెట్టి వారిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని క్షణాల్లో వైరల్‌ చేసి లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థులను విమర్శించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తదితర విషయాలు వివాదాస్పదంగా మారుతుంటాయి. దీనికితోడు ఎన్నికల కోడ్‌ రాకముందే సామాజిక మాధ్యమాల్లో పార్టీలు పోటీపడి దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటాయి. ఈక్రమంలో జిల్లాలో మీడియా మానిటరింగ్‌ కమిటీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు చేపట్టనుంది.

క్రిమినల్‌ కేసులు నమోదు…

విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచితమైన మార్ఫింగ్‌ చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు. ఐపీసీ 153ఏతోపాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం కింద నేర నిరూపణ అయితే మూడేళ్ల జైలు లేదా జరిమానా తీవ్రతను అనుసరించి రెండూ విధించే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దని, అనుచిత పోస్టులు పెట్టేవారిని గ్రూపుల నుంచి తొలగించాలని అడ్మిన్లకు పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల హడావుడి పెరిగిన నేపథ్యంలో రాజకీయ పార్టీలే లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్టు చేసే అవకాశం ఉంది. కరపత్రాలు తదితర వాటిని గ్రూపుల్లో ఉంచితే అవి వైరల్‌గా మారే అవకాశం ఉంది.

అప్రమత్తత ముఖ్యం…

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు, పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులు, యువత ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వ్యవహారంలో సంయమనం పాటించాలని స్పష్టం చేస్తున్నారు. సాధారణ సమయం, ఎన్నికల సందర్భంగా నమోదయ్యే కేసులకు తేడా ఉంటుందని పేర్కొంటున్నారు. కఠిన సెక్షన్లు పొందుపరిచి కేసులు నమోదు చేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో నేటి యువత అత్యంత జాగరూకతతో వ్యవహరించకుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందంటున్నారు.

నిరంతరం గమనిస్తూ..

జిల్లాస్థాయి మీడియా మానిటరింగ్‌ కమిటీలో కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, పోలీసు అధికారులు, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా ప్రతినిధి, సీనియర్‌ సిటిజన్‌, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులు. వీరు నిరంతరం ఆయా మాధ్యమాలను గమనించడంతోపాటు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. రోజూవారీ దినపత్రికలు కూడా పరిశీలిస్తారు. అభ్యంతకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు విడుదల చేసినా బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు అధికారులు తీసుకుంటారు.