తెలంగాణలో 24న ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్ :
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ బుధవారం ఏప్రిల్ 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారులు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 తేదీల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.
రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఈనెల 10 తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2023లో మే 9న రిజల్ట్స్ వచ్చాయి.
ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించారు. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తిచేశారు.