తెలంగాణ ఇంటర్ ఫలితాలు… కూలీ బిడ్డకు 993 మార్కులు
ఖమ్మం :
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన బాణోతు అంజలి ఈ ఘనత సాధించడం విశేషం. తండ్రి నర్సింహారావు, తల్లి జ్యోతి రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్తుంటారు.
కేవలం నాలుగో తరగతి వరకే చదువుకుని ఉన్నత విద్యాభ్యాసం చేయలేకపోయిన తండ్రి తన పిల్లలను చదివించి వృద్ధిలోకి తేవాలని భావించి ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. అంజలికి చిన్నప్పటి నుంచే చదువంటే ఎంతో ఇష్టం.
స్వగ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంది. జ్యోతిరావు ఫులే వెనకబడిన తరగతులు గురుకుల విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసింది. భద్రాచలంలో విద్యాలయంలో సీటు రావటంతో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు అక్కడే చదువుకుంది. ప్రతిభ కలిగిన విద్యార్థుల జాబితాలో ఖమ్మంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ప్రవేశం లభించింది. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాలని లక్ష్యం పెట్టుకున్న అంజలి ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు సాధించింది.
ద్వితీయ సంవత్సరంలో మరింత పట్టుదలతో చదివి 993 మార్కులు సాధించింది. మారుమూల గ్రామంలో జన్మించిన గిరిజన బిడ్డ అగ్రస్థానంలో నిలవడంపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు.