BJP కి గల్ఫ్ కార్మికుల బహిరంగ లేఖ…!!!
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు… నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏం చర్యలు తీసుకున్నది.
గత ఐదేళ్లలో గల్ఫ్ సమస్యల గురించి పార్లమెంటులో మీరు ఎందుకు మాట్లాడలేదు.
గల్ఫ్ దేశాలలో భారతీయ కార్మికులకు అక్కడ కంపెనీలు ఇస్తున్న కనీస వేతనాలను… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లను జారీ చేసింది. ఇందులో కేంద్రం జేబులోంచి ఇచ్చేది ఏముండదు. గల్ఫ్ దేశాల కంపెనీలు జీతాలు ఇస్తాయి… కార్మికులు తీసుకుంటారు. అరవింద్ గారు… గల్ఫ్ దేశాలలో పనిచేసే 88 లక్షల మంది భారతీయ కార్మికుల జీవితాలకు సంబంధించిన ఈ అంశంపై మీరు ఎందుకు స్పందించలేదు. ఎందుకు పార్లమెంటులో మాట్లాడలేదు. మేము చేసిన ఉద్యమ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం 10 నెలల తర్వాత పాత వేతనాలను కొనసాగిస్తామని ప్రకటించింది.
ప్రవాసి భారతీయ బీమా యోజన (PBBY) అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమాలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదు.
హైదరాబాద్ లో సౌదీ అరేబియా మరియు కువైట్ దేశాల కాన్సులేట్లు (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా… కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు.
ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో చాలా సార్లు పర్యటించారు. భారత్ – గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకోలేదు.
కరోనా కష్టకాలంలో గల్ఫ్ తదితర దేశాల నుంచి భారత్ కు వాపస్ వచ్చిన ప్రయాణీకుల నుంచి వందే భారత్ ప్లయిట్స్ లలో రెండింతలు, చార్టర్డ్ ఫ్లయిట్స్ లలో మూడింతలు విమాన ఛార్జీలు వసూలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ప్రవాసి కార్మికులను ఎందుకు దోచుకున్నది.
34 సంవత్సరాల క్రితం…1990 లో కువైట్ పై ఇరాక్ దురాక్రమణ ‘గల్ఫ్ యుద్ధం’ జరిగిన సందర్బంగా అప్పటి భారత ప్రధాని వి.పి. సింగ్ గారు, విదేశాంగ మంత్రి ఐ.కె. గుజ్రాల్ గారి నాయకత్వంలో ఒక లక్షా 70 వేల మంది భారతీయులను ఉచితంగా స్వదేశానికి తరలించారు. వి.పి. సింగ్ గారి లాగా ఇప్పటి ప్రధాని మోదీ గారు ఎందుకు ఉచితంగా విమానాలను ఏర్పాటు చేయలేకపోయారు.
గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం స్వయంగా ఇండియాకు రావడం వీలుకాదు. ప్లయిట్ చార్జీలు భరించడం, లీవ్ దొరకడం కష్టం. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ మోదీ గారి ప్రభుత్వం… ఎన్నారైలకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం (ET PBS) – ఆన్ లైన్ ఓటింగ్ ఓటింగ్ సౌకర్యం కల్పించలేకపోయింది. ‘ఆబ్సెంటీ ఓటర్స్’ గా మిగిలిపోతున్న గల్ఫ్ కార్మికులకు మీరు ఇచ్చే జవాబు ఏమిటి.
బీజేపీ మోదీ గారి ప్రభుత్వం ఆన్ లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది. మోదీకి ఎన్నారైలు అంటే… ఏదో తెలియని భయం పట్టుకున్నదా.
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్లు (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారత్ కు పంపారు. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. దేశానికి ఆర్థిక జవాన్లుగా పనిచేస్తున్న ప్రవాసులకు కేంద్రం అన్యాయం చేస్తోందని అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీనికి మీ జవాబు ఏమిటి.
బంగ్లాదేశ్ పౌరులు విదేశాల నుంచి పంపిన విదేశీ మారక ద్రవ్యంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత్ ఎందుకు ఇవ్వడం లేదో ఏనాడైనా ఆలోచించారా.
“ఇవాళ దుబాయిలో మనవాళ్ళు చేతికి కంకణం కట్టుకొని, నొదుట బొట్టు పెట్టుకొని, తిలకం దిద్దుకొని తిరుగుతున్నరు అంటే… దానికి నరేంద్ర మోదీ గారే కారణం” అని ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు వ్యాఖ్యానించడం ఘోర తప్పిదం.. సర్వ స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దుబాయి (యూఏఈ దేశం) పై భారత్ ఆధిపత్యం చలాయిస్తున్నది అనే అర్థం వచ్చేలా మాట్లాడటం దౌత్య నిబంధనలకు విరుద్ధం. దీనిపై మీ జవాబు ఏమిటి.
దుబాయిలో, మస్కట్, బహరేన్ లలో వంద సంవత్సరాలకు పూర్వమే హిందూ మందిరాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.
ఇలాంటి వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చిచ్చు పెట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందాలని చూడటం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి మాటల వలన దుబాయి, యూఏఈ దేశంలో మన ప్రవాస భారతీయుల ఉద్యోగ అవకాశాలపై దెబ్బ పడితే ఎవరు బాధ్యత వహిస్తారు.
ఎమిగ్రేషన్ యాక్టు1983 అనే విదేశీ వలసల నియంత్రణ చట్టం స్థానంలో… కొత్త చట్టం తేవాలనే ప్రతిపాదనలను గత ఐదేళ్లుగా బీజేపీ ఎందుకు పెండింగ్ లో పెట్టింది.