2035 కల్లా చంద్రుడిపై పరిశోధన కేంద్రం… చైనా బృహత్ ప్రణాళిక
రెండు దశల్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న చైనా తొలి దశలో 2035 కల్లా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రాథమిక పరిశోధన కేంద్రం ఏర్పాటు రెండో దశలో 2045 నాటికి పరిశోధన కేంద్రం మరింతగా విస్తరణ చంద్రుడి చుట్టూ తిరిగే మరో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు.
చంద్రుడిపై అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను తాజాగా విడుదల చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2035 కల్లా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చైనా ప్రకటించింది.
ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ పేరిట రెండు దశల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయనుంది. 2035 నాటికి పూర్తి కానున్న తొలి దశలో ప్రాథమిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రంలో పరిమిత వనరులతో సాధారణ శాస్త్ర అధ్యయనాలు చేపడతారు. సూర్యరశ్మి సోకని కారణంగా దక్షిన ధ్రువం వద్ద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చైనా తెలిపింది. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్ పరిశోధనలకు నీరు కీలకం కావడంతో చైనా దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుంది.
ఇక ప్రాజెక్టు రెండో దశ 2045 కల్లా పూర్తవుతుంది. ఇందులో భాగంగా తొలి దశ కేంద్రాన్ని మరింత విస్తృత పరుస్తారు. ఈ దశలో చంద్రుడి చుట్టూ తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతరిక్ష కార్యకలాపాలకు విస్తరణకు ప్రధాన కేంద్రంగా దీన్ని సిద్ధం చేస్తారు. శాస్త్రసాంకేతిక పరిశోధన, వనరుల అభివృద్ధి, నూతన సాంకేతికతల పరీక్షలను ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరిశోధన ఫలాలు కేవలం చంద్రుడిపై పరిశోధనకే కాకుండా అంగారకుడిపై కాలిడేందుకు కూడా ఉపయోగపడతాయని చైనా పేర్కొంది.
అంతరిక్ష పరిశోధన రంగంలో అమెరికాకు గట్టిపోటీ ఇస్తున్న చైనా.. తన లక్ష్యాలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది. చంద్రుడిపై మళ్లీ కాలుపెట్టాలని అనేక దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా కూడా ఈ దిశగా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు, అమెరికా, ఐరోపా దేశాలు చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ఆర్టమిస్ మిషన్ను అమెరికా చేపట్టింది.