లోక్‌సభ ఎన్నికలకు తగ్గుతున్న ఓటింగ్
2018లో ఎమ్మెల్యే ఎన్నికలకు 73.74
2019 ఎంపీ ఎన్నికలకు 62.77ు నమోదు
శాసనసభ ఎన్నికలతో పోలిస్తే..
అభ్యర్థుల ప్రచారం, ప్రాధాన్యం తక్కువే
ఎండలు మండుతుండడమూ కారణం!
ఈసారి మరింత తీవ్రంగా ఉన్న ఎండలు
హైదరాబాద్, ఏప్రిల్ 29లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ ఓటర్లు.. అసెంబ్లీ ఎన్నికల పట్ల చూపించినంత ఆసక్తి చూపడంలేదా? ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యం.. ఎంపీని ఎన్నుకునేందుకు ఇవ్వడంలేదా? అంటే.. ఆయా ఎన్నికల్లో నమోదవుతున్న ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. ప్రతిసారీ శాసనసభ ఎన్నికలతో పోలిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
ఇతర ప్రాంతాల్లో ఉండేవారు సైతం స్వస్థలాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. కానీ, ఎంపీ ఎన్నికలకు మాత్రం ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడంలేదు. 2018 డిసెంబరు 7న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 73.74గా నమోదు కాగా, ఆ తరువాత నాలుగు నెలలకు 2019 ఏప్రిల్ 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 62.77 శాతమే నమోదైంది. ఏకంగా 11 శాతం తగ్గింది. ఇందుకు రకరకాల కారణాల్లో ఎండాకాలం కూడా ఓ కారణమేనని స్పష్టమవుతోంది. 2019 ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్రంలో 42-43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఉష్ణోగ్రతలకే పోలింగ్ శాతం అంతగా తగ్గిందంటే.. ఈసారి ఇప్పుడే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇక పోలింగ్ జరిగే మే నెల రెండోవారం నాటికి ఇంకెంతగా పెరుగుతాయో, ఎండలు ఎంతగా మండిపోతాయో చెప్పలేని పరిస్థితులున్నాయి. అయితే పోలింగ్ తగ్గడానికి ఎండలతోపాటు ఇతర కారణాలు కూడా లేకపోలేదు.
ఆ స్థాయిలో ఉండని ప్రచారం..
రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. 2014లో జమిలి ఎన్నికలు జరిగినా.. 2018లో నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఈ పరిస్థితి వచ్చింది. తొలుత జరిగే శాసనసభ ఎన్నికలతో రాష్ట్రంలో అధికారం ఏ పార్టీదో తేలిపోతుండడంతో.. పార్లమెంటు ఎన్నికలతో రాష్ట్రంలో మారిపోయే సమీకరణాలేవీ ఉండవన్న అభిప్రాయం ఓటర్లలో నెలకొంటోంది. ఆ ఉద్దేశంతోనే 2019 పార్లమెంటు ఎన్నికలపై ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబరచలేదన్న అభిప్రాయాలున్నాయి. అంతేకాకుండా.. ఎంపీ అభ్యర్థులు, పార్టీలు గడగడపకు ప్రచారం చేయడం, మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించడం లాంటివి ఎమ్మెల్యే ఎన్నికల స్థాయిలో జరగవు. ఇక అసెంబ్లీ ఎన్నికల కోసం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా ఇళ్లకు రప్పించి ఓటేయించుకునే విధానం ఎంపీ ఎన్నికల్లో కనిపించదు. ఇది కూడా పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఎండకు బయటకొస్తారా? ఓటేస్తారా?
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటలకే 30 డిగ్రీలతో మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకే 40 డిగ్రీలకు చేరుతోంది. జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగే మే 13 నాటికి ఇది ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనన్న ఆందోళన ఉంది. గతేడాది మే 18న ఖమ్మం జిల్లా జూలూరుపాడులో అత్యధికంగా 46.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కొన్నిసార్లు మే నెలలో తెలంగాణలో 48 డిగ్రీలకు చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఓటర్లు ఓటేసేందుకు బయటకొస్తారా? అన్న సందేహాలు వస్తున్నాయి.