కామాంధుల కొమ్ము కాస్తున్న కమలదళం
జెడిఎస్‌తో కొనసాగుతున్న స్నేహబంధం . బ్రిజ్ భూషణ్‌పై నేటి వరకూ చర్యలే లేవు , మణిపూర్ దారుణాలపై మౌనమే.
న్యూఢిల్లీ :
బిజెపి నినాదం ‘బేటీ బచావ్ బేటీ పఢావ్’ మరోసారి ప్రశ్నార్థకమైంది. కర్ణాటకలోని హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనుమడు, జెడిఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఆయన తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టు సాయంతో దేశం విడిచి పరారవడం తెలిసిందే. రేవణ్ణ విదేశాలకు పారిపోవడానికి అవకాశం ఇచ్చారంటూ బిజెపి, అధికార కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
కర్ణాటకలో రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7న జరుగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే 14 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ప్రజ్వల్ రేవణ్ణను జెడిఎస్ బహిష్కరించినప్పటికీ ఆ పార్టీతో సంబంధాలను బిజెపి తెంచుకోలేదు. నేటి వరకూ స్పందించలేదు. రేవణ్ణ రాసలీలల విషయం తెలిసి కూడా ఆయనకే ఓటేయాలంటూ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను కోరారు.
బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే అధిక కేసులు
మోడీ ప్రభుత్వం 2015 జనవరిలో హర్యానాలో ‘బేటీ బచావ్.. బేటీ పఢావ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022 ఆగస్టులో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘నారీ శక్తి’ ప్రస్తావన చేశారు. మహిళలను అవమానించి, కించపరిచే ప్రతి సంస్కృతి, ప్రవర్తన అంతం కావాలని పిలుపునిచ్చారు. బిజెపి నేతల మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరదు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, న్యూ ఎలక్షన్ వాచ్ సంస్థల నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి 134 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నడుస్తున్నాయి. వీరిలో అత్యధికంగా 44 మంది బిజెపికి చెందిన వారే. 2014-2022 మధ్యకాలంలో మహిళలపై నేరాల సంఖ్య 31% పెరిగిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తెలిపింది. 2014లో 3,37,922గా ఉన్న ఈ నేరాల సంఖ్య 2022 నాటికి 4,45,256కు పెరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ రేవణ్ణ, బ్రిజ్ భూషణ్, కతువా అత్యాచార కేసు మొదలుకొని హత్రాస్, ఉన్నావ్, మణిపూర్ వరకూ బిజెపి మద్దతు, రక్షణతో రాజకీయ నాయకులు ఏ విధంగా రెచ్చిపోయి మహిళలపై అఘాయిత్యాలకు తెగబడ్డారో ‘ది వైర్’ పోర్టల్ పరిశీలించింది.
రేవణ్ణ అఘాయిత్యాలు
ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలో బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జెడిఎస్ నాయకుడు. రేవణ్ణ అఘాయిత్యాల వీడియోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మైసూరులో జరిగిన ఓ ర్యాలీలో రేవణ్ణ, దేవెగౌడలతో మోడీ ఎన్నికల వేదికను పంచుకున్నారు. రేవణ్ణపై ఆరోపణలు బిజెపి కేంద్ర నాయకత్వానికి ముందే తెలుసునని బయటపడినా మోడీ, అమిత్‌షా సభల్లో పాల్గొనడం గమనార్హం.
బ్రిజ్ భూషణ్ వేధింపులు
మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కాషాయ పార్టీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిజ్ భూషణ్‌కు ఈసారి టిక్కెట్ నిరాకరించిన బిజెపి ఆయన కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది. మహిళా రెజ్లర్లు ఆయనపై ఫిర్యాదు చేసినా, నిరసన ప్రదర్శనలు నిర్వహించినా, ఢిల్లీలో నెలల తరబడి నిర్బంధం నడుమ ఆందోళన సాగించినా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు.
రావణకాష్టంలా రగిలిన మణిపూర్
గత సంవత్సరం మే 3న మణిపూర్‌లో జాతి ఘర్షణలు మొదలయ్యాయి. కుకీలు, మైతీల మధ్య చెలరేగిన హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. వారిని నగంగా వీధుల్లో ఊరేగించారు. రాష్ట్రం రావణకాష్టంగా మారినా మోడీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించింది. హింస మొదలైన 78 రోజుల తర్వాత ప్రధాని పెదవి విప్పారు. బిజెపికే చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారే తప్ప పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించలేదు. ప్రధాని నేటి వరకూ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. హింసను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెనకేసుకొచ్చారు.
రేపిస్టులకు క్షమాభిక్ష
గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరిపిన 11 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే వారికి రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసి విడుదల చేసింది. నిందితుల్లో ఒకడైన శైలేష్ భట్‌తో కలిసి బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలు వేదికను పంచుకున్నారు. శిక్షకు గురైన వారికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించిందని, ఆ ఉత్తర్వుల ఆధారంగా వారిని విడుదల చేశామని 2022 అక్టోబరులో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. క్షమాభిక్షను ఆ తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది.
సస్పెన్షన్‌తో సరి
ఉన్నావ్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌పై చర్యలు చేపట్టనందుకు 2018లో బిజెపిపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, ప్రజల ఒత్తిడి పెరగడంతో ఎమ్మెల్యేను చాలా కాలం క్రితమే పార్టీ నుండి సస్పెండ్ చేశామంటూ 2019లో బిజెపి ఓ ప్రకటన చేసింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సెంగర్‌ను 2018లో అరెస్ట్ చేశారు. బాధితురాలి తండ్రి మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణపై న్యాయస్థానం ఆయనకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అత్యాచార కేసులో కూడా ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇంత జరిగినా సెంగర్ రాజకీయ ప్రాభవం ఏమీ తగ్గలేదు.
వీరు సైతం…
సంచార జాతికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూకాశ్మీర్‌లో 2018లో బిజెపి నేతలు ప్రదర్శన నిర్వహించారు. అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విజరు శర్మ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 2020లో 19 సంవత్సరాల దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన నలుగురు ఠాకూర్లు సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారు. యువతి మృతదేహాన్ని రాత్రికి రాత్రే హడావిడిగా పోలీసులు దహనం చేశారు. కనీసం కుటుంబసభ్యులను కూడా రానీయలేదు. మెజిస్ట్రేట్ ఎదుట యువతి మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ బాధితులు నిర్దోషులుగా బయటపడ్డారు.