ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ కొన‌సాగించాం… రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద కోపంతో ఆప‌లేదు కదా..? KCR

ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ కొన‌సాగించాం… రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద కోపంతో ఆప‌లేదు కదా..? KCR

హైద‌రాబాద్ :

స్వ‌ర్గీయ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద కోపంతో త‌మ ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ఆప‌లేదు క‌దా..? ఆ రెండు ప‌థ‌కాల‌కు అడిష‌న‌ల్ నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లామ‌ని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ రెండు ప‌థ‌కాల వ‌ల్ల ఎంతో మందికి ల‌బ్ధి చేకూరింద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఈ రాష్ట్రంలో మేధావుల‌కు, నాకు వ్య‌క్తితంగా ఇబ్బంది క‌లిగించిన అంశం ఏంటంటే.. రాష్ట్ర భ‌విష్య‌త్‌ను కాంక్షించే ఏ ప్ర‌భుత్వం కూడా అంత బాధ్య‌తారాహిత్యంగా ఉండ‌రు. రాష్ట్రం దివాళా తీసింద‌ని ఏ పిచ్చి ముఖ్య‌మంత్రి కూడా చెప్పాడు. అది స్టేట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తుంది. రాష్ట్రానికి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌కొడుతోంది. రాక్ష‌స ఆనంద‌రం కోసం, సంతోషం కోసం తాత్కాలికంగా ఆ నిమిషం వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డొచ్చు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుంద‌ని చెప్పాలి. నేను సీఎం అయ్యాక తెలంగాణ ధ‌నిక రాష్ట్రం అని చెప్పి నిరూపించాను. ధ‌నిక రాష్ట్ర‌మ‌ని చెబుతూ ఆ దిశ‌గా ప‌య‌నిస్తూ అద్భుత విజ‌యం సాధించాను. శాస‌న‌స‌భ‌లో శ్వేత‌ప‌త్రాలతో త‌ప్పుడు అంకెలు, లెక్క‌ల‌తో కాల‌యాప‌న చేసి భంగ‌ప‌డ్డారు. ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క ముందు అనేక వ్య‌వ‌స్థ‌లు చాలా చ‌క్క‌గా ప‌ని చేశాయ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

నేను సీఎం అయ్యాక హెల్త్ డిపార్ట్‌మెంట్ రివ్యూ చేశాం. ఆరోగ్య శ్రీ వివ‌రాలు చెప్పారు. ఇది రాజ‌వేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ప్రారంభించింది. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగం ఉంద‌ని చెప్పారు. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఎంత మ‌నీ అవ‌స‌రమో తీసుకుని పేరును కూడా మార్చొద్దు అని చెప్పాను. విద్యాశాఖ రివ్యూలో కూడా రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించిన ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ గురించి చెప్పారు. మంచి కార్య‌క్ర‌మం కానీ అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌న్నారు. వాటిని స‌రిద్దిద్దాల‌ని చెప్పాను. ప‌థ‌కాన్ని నిల‌పొద్దు.. అడిష‌న‌ల్ మ‌నీ తీసుకోవాల‌ని చెప్పాను. ఏ ప్ర‌భుత్వం పెట్టిన కార్య‌క్ర‌మం కార్య‌క్ర‌మ‌మే. తెలంగాణ వ్య‌తిరేకి అయిన‌ప్ప‌టికీ కూడా ఆ మ‌హ‌నీయుడు చ‌చ్చి స్వ‌ర్గంలో ఉన్న‌ప్పటికీ మంచి ప‌థ‌కం పెట్టిండు అని చెప్పి ఆరోగ్య శ్రీ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేశాం. ఈ ప‌థ‌కంలో మ‌రిన్ని రోగాల‌ను యాడ్ చేశాం. మంచి ప‌ద్ద‌తుల్లో కొనసాగిస్తాం అని చెప్పాం. కానీ కాంగ్రెస్ లాగా చెరిపేస్తామ‌ని చెప్ప‌లేదు. అది కంటిన్యూ చేశాం. ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ చేశాం. కానీ ఈ ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌కుండా దెబ్బ‌తీసుకుంది. బేష‌జాల‌కు పోయి వాళ్ల కాళ్లు వాళ్లే విర‌గొట్టుకున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు..