మూగబోయిన మైకులు…! ప్రచారానికి తెర, అమల్లో ఉండే ఆంక్షలివే…!!
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. హైదరాబాద్…. తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు.
ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే..
ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.
ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు (మే 11 సాయంత్రం 5 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు) వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.
పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.
ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.
మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.