పంచాయతీలకు నిధులు లేవు… పైసా విదల్చని కాంగ్రెస్ ప్రభుత్వం
ఆర్థిక సంఘం నిధులకు మంగళం
పల్లెలకు ప్రభుత్వం మొండిచేయి.. భారంగా తాగునీటి నిర్వహణ.
సిబ్బందికి జీతాలివ్వలేని దుస్థితి.. అప్పు తెచ్చి పనులు చేస్తున్న పీఎస్‌లు.
దీంతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి. కనీసం పారిశుద్ధ్య సిబ్బందికి కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వలేని దుస్థితికి పంచాయతీలు చేరాయి. వేతనాలు అందక చిన్న ఉద్యోగులు అలమటిస్తున్నారు. ఒకవైపు పాలకవర్గాలు లేక, ఇంకోవైపు నిధులు లేక పంచాయతీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో ప్రభుత్వం నెలకు రూ.230 కోట్ల చొప్పున పంచాయతీలకు నిధులు విడుదల చేసేది. గ్రామ పంచాయతీలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని, నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి, ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించింది కేసీఆర్ ప్రభుత్వం.
గ్రామానికి ట్రాక్టర్, రోడ్ల వెంబడి మొక్కలు నాటడం, చెత్తను సేకరించటం, డంపింగ్ షెడ్ నిర్మాణం చేపట్టారు. కేంద్ర నిధులతో సమానంగా నిధులను విడుదల చేయడంతో అనేక పంచాయతీలు జాతీయస్థాయి అవార్డు సాధించాయి. జనరల్ ఫండ్ నిధులను కరెంటు బిల్లులకు చెల్లించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంతో వాటికే ఆ నిధులు సరిపోతున్నాయని స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలదే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో గత 2, 3 నెలలుగా పంచాయతీలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటి నిర్వహణ ఖర్చులకూ తమ జేబుల్లో నుంచి పెట్టాల్సి వస్తున్నదని కార్యదర్శులు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయటం లేదని తెలిపారు. గ్రామాల్లో సమస్యలు వచ్చి పరిష్కారం కాకపోతే తమకు మెమోలను జారీ చేస్తున్నారని, కానీ నిధుల గురించి మాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీకి ఉన్న ట్రాక్టర్లో డీజిల్ పోయటానికీ డబ్బులు లేని దుస్థితి నెలకొన్నదని, గ్రామాల్లో చెత్త ఎత్తిపోయటానికి కష్టం అవుతున్నదని వెల్లడించారు. తమ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు తయారైందని పేర్కొంటున్నారు.