‘జైల్లో పెట్టండి’.. మా MP , MLAలతో వస్తున్నా…
న్యూఢిల్లీ :
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోది కోరుకుంటున్నారని, దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ‘ఆప్’ను లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నందునే తమ నేతలనందరినీ జైలుకు పంపాలనుకుంటోందని అన్నారు.
మీ హెడ్‌క్వార్టర్స్‌కు వస్తున్నాం…
ప్రధానమంత్రి ”జైలు ఆట” (జైల్ కా ఖేల్’) ఆడుతున్నారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ”ప్రధానమంత్రికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ ‘జైల్ కా ఖేల్’ ఆడుతున్నారు. నేను రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నాను. మీరు ఎవర్ని కావాలనుకుంటే వారిని జైలులో పెట్టండి. మమ్మల్నిందరినీ కూడా జైల్లో పెట్టండి. ప్రతి ఒక్కరినీ జైలుకు పంపితే ఆప్‌ను అణగదొక్కవచ్చని మీరు అనుకుంటున్నారేమో? అది మాత్రం సాధ్యం కాదు, ఆప్ అనేది ఒక ఐడియా” అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
డ్రామాలొద్దు… బీజేపీ కౌంటర్
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ వెంటనే స్పందించారు. కేజ్రీవాల్ ఈ డ్రామాలు ఆపాలన్నారు. తాము ఒకటే ప్రశ్న అడుగుతున్నామని, సొంత పార్టీకే చెందిన మహిళా ఎంపీపై సీఎం నివాసంలోనే దాడి జరిగి ఆరు రోజులైనా ఆయన ఇంతవరకూ ఎందు మౌనం వీడలేదో చెప్పాలన్నారు. మహిళ ఎంపీపై అనుచిత ప్రవర్తనకు బాధ్యులెవరని ప్రశ్నించారు..