బెంగళూరు రేవ్ పార్టీ… ఎవరీ వాసు? నిరుపేద నుంచి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు…?

బెంగళూరు రేవ్ పార్టీ… ఎవరీ వాసు? నిరుపేద నుంచి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు…?

ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించిన వ్యక్తి. నేడు కోట్లకు అధిపతి. బెంగళూరులో రేవ్ పార్టీ ఇచ్చిన లంకపల్లి వాసుకి సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి.. క్రికెట్ బెట్టింగ్ తో జర్నీ స్టార్ట్ చేసి రాజకీయ బెట్టింగ్ ల వరకు అన్నీ కలిసొచ్చి కోట్లకు అధిపతి అయ్యాడు. క్రికెట్ తో పాటు దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా.. బెట్టింగ్ లు నిర్వహిస్తుండే వాడు. అలా దాదాపు 200 కోట్ల వరకు బెట్టింగ్స్ పైనే సంపాదించినట్లు తెలుస్తోంది.

నిరుపేద నుంచి కోట్లకు పడగలెత్తిన వాసు..

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ బెట్టింగ్స్, డ్రగ్స్ సప్లయ్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. విజయవాడ కొత్తపేటలో కొండపై గతంలో ఓ పూరింట్లో నివాసం ఉండే వాడు వాసు. తల్లిదండ్రులు తొలుత కూలీ పనులు చేసుకుని జీవించే వారు. తండ్రి చనిపోవడంతో తల్లి ఎల్ఐసీ ఏజెంట్ గా పని చేసి కుటుంబాన్ని పోషించేది. చిన్నప్పటి నుంచి వాసుకి క్రికెట్ అంటే ఇష్టం. క్రికెటర్ కావాలన్నదే తన లక్ష్యం కూడా.

క్రికెట్ బెట్టింగ్ పై పట్టు సాధించాడు..

గేమ్ పై ఎంతో అభిమానం. చివరికి ఆ అభిమానే అతడిని బుకీగా మార్చింది. కేదారేశ్వరపేటలో లోటస్ కు చెందిన ఒక బుకీని పరిచయం చేసుకుని అతడి వద్ద చేరి బెట్టింగ్ లపై పూర్తి పట్టు సాధించాడు వాసు. అనతికాలంలోనే కోట్లు కొల్లగొట్టాడు. ఎన్నో ఇళ్లు, విల్లాలు కట్టాడు. వాటన్నింటికి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఆంజనేయవాగు కొండ ప్రాంతంలో పైభాగాన ఒక రేకుల షెడ్డును అత్యాధునికంగా నిర్మించి సీసీ కెమెరాలు అమర్చాడు. స్థానికంగా ఉండే బుకీలు ఈ షెడ్ లో బెట్టింగ్ లు నిర్వహించే వారు.

చాలా రాష్ట్రాల్లో నెట్ వర్క్ ఏర్పాటు..

బెంగళూరు, చెన్నై, ముంబై, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్ లు నిర్వహించే వాడు. ఇలా చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు వాసు. ఒక్క విజయవాడలోనే 150మందికిపైగా ఉన్నారంటేనే మనోడు ఎలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడో అర్థం అవుతుంది. ఒక్క బెట్టింగ్సే కాదు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో పబ్ లను సైతం నిర్వహిస్తున్నాడు వాసు

ఎక్కడికి వెళ్లినా విమానంలోనే..

వాసు భార్య ఇద్దరు కూతుళ్లు విజయవాడలోనే ఉంటారు. వాసు మాత్రం ఒకటి రెండు రోజులు వచ్చి వెళ్తుంటాడు. చుట్టుపక్కల వారు అడిగితే దుబాయ్, మలేషియా, బెంగళూరులో పని చేస్తున్నానని చెప్పి నమ్మించే వాడు. వాసు ఎక్కడికి వెళ్లినా విమానాల్లోనే తిరిగే వాడు. వాసుకు కోటి విలువైన విలాసవంతమైన కార్లు నాలుగు వరకు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో భారీగా విల్లాలు, ఇళ్లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క విజయవాడలోనే రెండు విల్లాలు, ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో అద్దె భవనంలో ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు వాసు.

మూత్రపిండాలు, గుండె సంబంధ సమస్యలు..

విజయవాడలో చాలాసార్లు పెద్ద ఎత్తున అతడి అనుచరులు పోలీసులకు పట్టుబడినా.. పలుకుబడిని ఉపయోగించి వారిని బయటకు తీసుకొచ్చేవాడు. బెంగళూరు రేవ్ పార్టీలో తప్పితే.. ఇంతవరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు. అయితే లాక్ డౌన్ టైమ్ లో క్రికెట్ ఆడుతూ ఉండగా వాసు కాలుకి పెద్ద దెబ్బ తగిలింది. ఇటీవలి వరకు చేతికర్ర సాయంతోనే నడిచేవాడు. మూత్రపిండాలు సైతం దెబ్బతిన్నాయి. గుండె సంబంధ సమస్యలు రావడంతో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ఇలా కఠిక పేదరికం నుంచి వచ్చి వాసు నేడు కోట్లకు పడగలెత్తిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.