పోలీస్ విచారణకు డుమ్మా కొట్టిన హేమ… టైం కావాలంటూ బెంగళూరు పోలీసులకు లేఖ

పోలీస్ విచారణకు డుమ్మా కొట్టిన హేమ… టైం కావాలంటూ బెంగళూరు పోలీసులకు లేఖ

వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానంటూ రిక్వెస్ట్ తిరస్కరించిన పోలీసులు..

మళ్లీ నోటీసులు జారీకి ప్రయత్నం

హేమతో సహా మొత్తం 86 మందికి నోటీసులు పంపిన సీసీబీ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. రేవ్ పార్టీలో దొరికిన వారిలో డ్రగ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం (మే 27) రోజు బెంగళూరులోని సీసీబీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ కూడా ఈ నోటీసులు అందుకున్నారు. అయితే, విచారణకు వెళ్లలేదు. దీనిపై బెంగళూరు పోలీసులకు హేమ ఓ లేఖ రాశారు. తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని, విచారణకు హాజరుకాలేనని అందులో పేర్కొన్నారు.

విచారణకు హాజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని పోలీసులను అభ్యర్థించారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నట్లు సమచారం. ఈ నెల 19న బెంగళూరులోని జీఆర్ ఫాంహౌస్ లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఫాంహౌస్ పై దాడి చేసి మొత్తం 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ రక్తపరీక్షలు చేయగా.. నటి హేమతో పాటు మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో వీరిని విచారించేందుకు నోటీసులు పంపించారు.