చంద్రుడి మీద బతకాల్సి వస్తే అక్కడ తినడానికి ఏముంటుంది, సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలేంటి?
అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు, అయితే మనం అక్కడకు వెళితే ఏం తినవచ్చు? గాలి నుంచి తయారు చేసిన పాస్తా, ప్రొటీన్ బార్లు జస్ట్ ఒక ప్రారంభమేనా? ఇంకా అనేక రూపాల్లో ఫుడ్‌ను తయారు చేస్తున్నారా?
అంతరిక్షం మీద ఆధిపత్యం కోసం పోటీ వేగం పుంజుకుంది. రానున్న రెండేళ్లలో అర్టెమిస్ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపాలని నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. 15 ఏళ్లు కక్ష్యలో ఉండేందుకు నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం 26వ ఏడాదిలోకి అడుగు పెట్టిది. త్వరలో దీనిస్థానంలో మరోక సెంటర్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
అంతరిక్షంలోని ఇతర గ్రహాల మీదకు మనిషిని పంపించేందుకు శాస్త్రవేత్తలు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికి తోడు డబ్బులున్న వ్యక్తుల్ని రాకెట్ల ద్వారా అంతరిక్షం అంచుల్లోకి తీసుకెళ్లే పర్యాటక కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత అక్కడ మనం ఏం తినాలి, ఎలా బతకాలి?
“సరైన ఆహారమే ఆస్ట్రోనాట్స్‌ను ఆలోచనాత్మకంగా పనిచేసేలా చేస్తుంది” అని యూరోపియన్ అంతరిక్ష సంస్థలో ఆస్ట్రోనాట్ ఆపరేషన్స్ డిప్యూటీ లీడ్ డాక్టర్ సొంజా బ్రంగ్స్ చెప్పారు.
“డీప్ స్పేస్ మిషన్లు విజయవంతం కావాలంటే వ్యోమగాములకు వివిధ పోషక గుణాలున్న సరైన ఆహారాన్ని అందించడం ముఖ్యం. చాలా కీలకమైన విషయాన్ని ఎవరూ సరిగా పట్టించుకోవడంలేదని నాకు అనిపిస్తోంది” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం వ్యోమగాములకు సిద్ధం చేసి ఉంచిన ఆహారాన్ని (ప్రిపేర్డ్ ఫుడ్) చిన్న ప్యాకెట్లలో పెట్టి ఇస్తున్నారు.
ఈ ఆహారాన్ని ప్రత్యేకమైన ఆహార సంస్థలు తయారు చేస్తున్నాయి. ఆహారాన్ని సిద్దం చేశాక దాన్ని ఘనీభవింపచెయ్యడం, నిర్జలీకరణం లేదా థర్మో స్టెబిలైజ్ చేస్తాయి.
ఈ ఆహరాన్ని తినేందుకు ఆస్ట్రోనాట్లు దీన్ని నీటితో వేడి చెయ్యడం లేదా చల్లబరచడం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఇంటి నుంచి కూడా ఆహారం తెచ్చుకుంటారు. ( దీన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసి థర్మో స్టెబిలైజ్ చేస్తారు)