రేవంత్ రెడ్డి ప్రభుత్వానివి తుగ్లక్ ఆలోచనలు..
తెలంగాణా రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో విషయంలో అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ గాని రేవంత్ రెడ్డి గాని ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, పదేళ్ల తర్వాత ఇప్పుడు మారుస్తామనడం కచ్చితంగా పరిపాలన చేతకాని తుగ్లక్ ఆలోచనలే అని ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.
ఓవైపు చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాచరికపు చిహ్నాలుగా చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో జరుపబోతున్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఇవే చిహ్నాలను స్వాగత ద్వారాలుగా ఏర్పాటు చేయడం విచిత్రంగా ఉందని రాజా వరప్రసాద్ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర దినం నాడు నెహ్రూ నాటి నుండి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా అందరూ మువ్వన్నెల జెండా ఎగరేస్తున్నది ఢిల్లీలోని ఎర్రకోటపైనే.. మరి ఎర్రకోట రాచరిక ఆనవాలు కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఒకవైపు రాష్ట్ర రైతాంగం విత్తనాల కోసం ఎరువుల కోసం అగచాట్లు పడుతుంటే మరోవైపు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగుతుంటే బాధ్యత మరిచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి తలతిక్క ఆలోచనలు చేస్తున్నదని తూర్పారబట్టారు. ప్రజానీకం, మేథావులు, ఉద్యమకారులు ప్రశ్నించకపోతే రేవంత్ రెడ్డి… చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, నిజాం కాలేజీ, పేర్లు కూడా మార్చే ప్రమాదం ఉందని రాజా వరప్రసాద్ సందేహం వ్యక్తం చేశారు..