ఫోన్‌పేలో ఇక‌పై హోమ్, గోల్డ్‌ లోన్స్‌

ఫోన్‌పేలో ఇక‌పై హోమ్, గోల్డ్‌ లోన్స్‌

కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ల‌ను తెచ్చిన ఫోన్‌పే.

అందుబాటులోకి మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కారు, హోమ్/ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్లు.

ఇందుకోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో సంస్థ‌ భాగ‌స్వామ్యం.

ఫోన్‌పే త‌న‌ కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఫోన్‌పే వినియోగదారులకు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కారు, హోమ్/ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తున్నట్టు గురువారం సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇందుకోసం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), టాటా క్యాపిటల్, ఎల్‌&టీ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, డీఎంఐ హౌసింగ్ ఫైనాన్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రూపే, వోల్ట్ మనీ, గ్రాడ్‌రైట్ వంటి ఫిన్‌టెక్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు ఫోన్‌పే ప్ర‌క‌టించింది. ప్రస్తుతం 15 సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, వచ్చే త్రైమాసికం నాటికి మరో 10 సంస్థల‌ను భాగ‌స్వాములుగా చేర్చుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

ఫోన్‌పే లెండింగ్ సీఈఓ హేమంత్ గాలా మాట్లాడుతూ.. “సెక్యూర్డ్ లోన్ల‌ను డిజిటల్ ప‌ద్ద‌తిలో మంజూరు చేయ‌డానికి రుణదాతలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. క‌స్ట‌మ‌ర్లు కూడా వేగంగా డిజిటలైజేషన్‌కు అల‌వాటు ప‌డుతున్నారు. అందుకే లెండింగ్ ఎకోసిస్టమ్‌తో పని చేసే కస్టమర్ల‌కు సెక్యూర్డ్ లోన్స్‌ను అందించ‌డానికి ఇది గొప్ప సమయం అని మా న‌మ్మ‌కం” అని అన్నారు.