ఇష్టం లేని కట్టింగ్ చేయించారని తొమ్మిందెండ్ల బాలుడు ఆత్మహత్య

ఇష్టం లేని కట్టింగ్ చేయించారని తొమ్మిందెండ్ల బాలుడు ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు తనకు ఇష్టం లేని జుట్టు కత్తిరించాడన్న కోపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి గురువారం మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కదిలించగా, చింతగూడెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన ఈసం హర్షవర్ధన్ సీతానగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మే 25న ఈసం కాంతారావు తన కుమారుడు హర్షవర్ధన్‌ను హెయిర్‌ కటింగ్‌ కోసం స్థానిక సెలూన్‌ షాపుకు తీసుకెళ్లాడు. కాంతారావు తండ్రి చెప్పిన ప్రకారం, సెలూన్ షాప్ వ్యక్తి హర్షవర్ధన్‌కు హెయిర్‌కట్ ఇచ్చాడు, కాని అది హర్షవర్ధన్ కి నచ్చలేదు. కటింగ్ నచ్చలేదని హర్షవర్ధన్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తండ్రి కాంతారావు హెయిర్ కటింగ్ అలాగే ఉంచాలని హర్షవర్ధన్ ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ హర్షవర్ధన్ వినకుండా ఏడుస్తూనే ఉన్నాడు. సరేలే కాసేపు అయ్యాక కొడుకు ఊరుకుంటాడు అనుకున్నారు తల్లిదండ్రులు. దీంతో ఇంటి వెనుక పనుల్లో తల్లిదండ్రులు నిమగ్నమై ఉండగా హర్షవర్ధన్ వాంతులు చేసుకున్నట్లు శబ్దాలు వినిపించాయి.

వెంటనే ఇంట్లోకి వచ్చిన కాంతారావు హర్షవర్ధన్ వాంతులు చేసుకోవడం చూశాడు. కంగారు తల్లిదండ్రులు ఏడుస్తూ ఏమైందని అడిగారు. చివరకు కటింగ్ నచ్చక పురుగుల మందు తాగానని హర్షవర్ధన్‌ నిజాన్ని బయటపెట్టాడు. వెంటనే బాలుడిని అక్కడి నుంచి నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే హర్షవర్ధన్ అపస్మారక స్థితిలో ఉండడంతో అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కానీ కోలుకోకపోవడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షవర్ధన్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గంగారం ఎస్సై బి.రవికుమార్ వివరించారు. చిన్న విషయానికి బాలుడు ప్రాణాలు తీసుకోగా.. బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.