నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా కొణిదెల ఉపాసన నియామకం

నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా కొణిదెల ఉపాసన నియామకం

అపోలో హాస్పిటల్స్ ట్రస్ట్ తో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా ఒప్పందం
అటవీశాఖ సిబ్బందికి అపోలో ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం
నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా ఉపాసన నియామకం
నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్న ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి కొణిదెల ఉపాసనను ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచుర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ రేంజర్ అంబాసిడర్ గా నియమించారు.

ఆమె నాలుగేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా విభాగం, అపోలో హాస్పిటల్స్ చారిటబుల్ ట్రస్ట్ (ఏహెచ్ సీటీ) మధ్య ఒప్పందం కుదిరింది.

అపోలో హాస్పిటల్స్ సామాజిక సేవా కార్యక్రమాల విభాగానికి ఉపాసన వైస్ చైర్ పర్సన్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, తాజా ఒప్పందం నేపథ్యంలో, దేశంలో ఎక్కడైనా పులుల సంరక్షణ కేంద్రాల్లోనూ, వన్యప్రాణి రక్షిత ప్రాంతాల్లోనూ గాయపడిన అటవీశాఖ సిబ్బందికి అపోలో ఆసుపత్రుల్లో నాణ్యమైన చికిత్స అందిస్తారు.

దీనిపై ఉపాసన మాట్లాడుతూ….

అటవీ సిబ్బంది అజ్ఞాత వీరులు వంటి వారని, సహజసిద్ధ జంతు ఆవాసాలను, అటవీప్రాంతాలను కాపాడడంలో వారు అలుపన్నది లేకుండా పనిచేస్తుంటారని కొనియాడారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం తాము కట్టుబడి ఉన్నామని ఉపాసన స్పష్టం చేశారు.

కాగా, అటవీశాఖ సిబ్బందికి మాత్రమే కాకుండా, జంతువుల దాడిలో గాయపడిన స్థానిక వన్యప్రాణి సంరక్షణ సంఘాల సభ్యులకు కూడా చికిత్స అందించనున్నారు.