త్వరలో BRS విస్తృతస్థాయి సమావేశం… పార్టీ, పార్టీయేతర ప్రముఖులతో సమాలోచనలు

త్వరలో BRS విస్తృతస్థాయి సమావేశం… పార్టీ, పార్టీయేతర ప్రముఖులతో సమాలోచనలు… కార్యకర్తలు, అనుబంధ సంఘాలకు శిక్షణ శిబిరాలు

రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయటంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మేధో మథనం చేస్తున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో పార్టీపరంగా చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తున్నారు. నాలుగైదు రోజులుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారు.

వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు, సహచర ఉద్యమకారులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ మాజీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల మాజీ సభ్యులు, సోషల్‌ మీడియా కన్వీనర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం…

నాలుగైదు రోజులుగా వివిధ రంగాల ప్రముఖులు, ఉద్యమకారులు, మేధావులు, పార్టీ నేతల నుంచి వస్తున్న సూచనలను పరిగణనలోకి తీసుకొని, వాటిని పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముందు చర్చకు పెట్టి అనంతరం భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన చేయాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ మాజీ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో త్వరలో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, పార్టీ ప్రధాన కమిటీతోపాటు పార్టీ అనుబంధ కమిటీలకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలని గతంలో అనుకున్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పుడు నిత్యం పాలనపై దృష్టి సారించడం వల్ల వాటిని నిర్వహించలేని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అన్ని స్థాయిల శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించే విషయాన్ని పరిశీలించాలని పార్టీ నేతలు కొందరు కేసీఆర్‌కు సూచించినట్టు సమాచారం.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రజలు పెదవి విరుపుతో ఉన్నారు. వేచి చూసే ధోరణిలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? తెలంగాణ హక్కులకు కలుగుతున్న భంగం, వాటి పరిరక్షణకు పార్టీగా అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి? తదితర అంశాలపై పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి అందుకు అనువైన కార్యాచరణను రూపొందించేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణను సాధించి అభివృద్ధిలో అగ్రపథంలో నిలిపామని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది.