హైదారాబాద్ :
రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ – జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ
విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్పారు. ERC సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు., రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు., విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈమేరకు కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు.
‘రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది మందుకు పురోగమించడం జరిగింది.
రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే కమిషన్ వేశారు.మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చూపించేందుకే ప్రభుత్వ ప్రయత్నాలు.
పత్రికా విలేకఖరుల సమావేశంలో కమిషన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది, విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది.
ఇప్పటికే నష్టం జరిగినట్లు.. ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు.
మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని వైదొలిగితే మంచిది. మీరు కమిషన్ బాధ్యల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా’ అంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.
గౌరవనీయులైన జస్టిస్ నరసింహారెడ్డి గారికి,
ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ,
సెవన్త్ ఫ్లోర్, బి.ఆర్.కె.ఆర్. భవన్, ఆదర్శ్ నగర్,
హైదరాబాద్ – 500053.
సబ్జెక్ట్: ది కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ, కాన్‌స్టిట్యూటెడ్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ – 1952
వైడ్. జి.ఓ.ఎం.ఎస్. నం. 09, ఎనర్జీ (పవర్- II) డిపార్ట్మెంట్, డేటెడ్ 14-3-2024.
రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్తు రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్‌కు కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది. దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోవడం, దరిమిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి తెలంగాణవ్యాప్తంగా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలీడేలు ప్రకటించడం, దరిమిలా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేయడం, గృహ అవసరాలకు కూడా అన్ని అపార్టుమెంట్లలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాపుకు పోయినా జనరేటర్ల రొద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తం జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియనిది కాదు. నాడు తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్తు సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉండేది. ఇది కేవలం పల్లె సీమల పరిస్థితే కాదు. మండల కేంద్రాల్లో ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలుండేవి. మున్సిపాలిటీల్లో 6 గంటల పాటు, రాజధాని హైదరాబాద్‌లోనూ ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ కరెంటు కోతల బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే, అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది.
ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు అవసరాల దృష్ట్యా, రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్తు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, విభజన తర్వాత రెండు రాష్ర్టాలు విద్యుత్తును వినియోగించాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం కేటాయించి, ఆవిధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంతమాత్రం సరిపోదు. అప్పటి (2014) వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2,700 మెగావాట్ల కొరత ఉంది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ సరఫరాను ఎగవేయడం వల్ల 1,500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. వెరసి మొత్తమ్మీద సుమారు 5,000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్తు రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దరిమిలా రాష్ర్టాన్ని విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించడానికిగాను, తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే దిశగాను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి, కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి. అత్యంత అధ్వాన్న పరిస్థితిలో ఉన్న తెలంగాణ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను పటిష్ఠపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకుని విజయం సాధించడం, విద్యుదుత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడం ఇందుకు ఉదాహరణలు. తత్ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు, తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైచిలుకుకు చేరడం, అటు సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠపడి సక్రమ విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా మన భారతదేశంలోనే నాణ్యమైన నిరంతరాయ (24X7) కరెంటును అన్ని రంగాలకూ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ వినుతికెక్కడం తమరికి తెలియని విషయం కాదు. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన నాడు తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,196 యూనిట్లు ఉండగా, పదేండ్ల కాలంలోనే అది 2,349 యూనిట్లకు పెరగడం, ఆ ఫలాలను మనమంతా అనుభవించడం మనందరికీ గర్వకారణం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయాలను ఆషామాషీగా సాధించలేదు. ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్తు కొనుగోళ్ల విధానంలో కావచ్చు. లేదా రాష్ట్రంలో నూతన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటిస్తూ, కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ, ముందుకు పోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికీ అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది, ముందుకు పురోగమించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏర్పడిన, న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్.ఇ.ఆర్.సి.)ల యొక్క తీర్పులకు లోబడే అన్ని చర్యలూ తీసుకోవడం జరిగింది. అట్టి చర్యలపై ఏదేని ఒక వ్యక్తికిగానీ, లేదా వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ అభ్యంతరాలు ఉన్న యెడల ఇ.ఆర్.సి.లు నిర్వహించే పబ్లిక్ హియరింగుల్లో తమ ఆక్షేపణలను తెలియజేయవచ్చు. ఏదేని విషయంపై వారి అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఇ.ఆర్.సి. తీర్పు వెలువడినచో వారు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఆప్టెల్)కు అప్పీలు చేసుకోవచ్చు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీ రేవంత్‌రెడ్డిగారు తెలంగాణ ఇ.ఆర్.సి.కి తన అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలను పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే, తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఇ.ఆర్.సి. ఆమోదముద్ర వేయడం జరిగింది. అప్పటికీ శ్రీ రేవంత్‌రెడ్డిగారికి తెలంగాణ ఇ.ఆర్.సి. నిర్ణయాలపై అభ్యంతరాలో, ఆక్షేపణలో ఉండి ఉంటే, ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఆప్టెల్)కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం ఆయనకు కల్పించింది. కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలుకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా శ్రీ రేవంత్‌రెడ్డిగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తదనంతరం శ్రీ రేవంత్‌రెడ్డిగారి ప్రభుత్వం, గొప్ప విద్యుత్తు విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది. వాటిమీద రాష్ట్ర శాసనసభలో చర్చోపచర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న ఎంక్వయిరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా శ్రీ రేవంత్‌రెడ్డిగారి ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అట్టి ఎంక్వైరీ కమిషన్‌ను మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు, న్యాయ ప్రాధికార సంస్థలైన ఇ.ఆర్.సి.లు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే 11.06.2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ, నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నాను.
థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో రెండు రకాలున్నాయి. 1. సబ్ క్రిటికల్. 2. సూపర్ క్రిటికల్. సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ కాగా, సూపర్ క్రిటికల్ అనేది దాని తర్వాత వచ్చినది. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ వల్ల కాలుష్యం తక్కువ. అయితే సబ్ క్రిటికల్ కన్నా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. తెలంగాణ కొత్త విద్యుత్తు కేంద్రాల నిర్మాణం ప్రారంభించే 2014 నాటికి భారత దేశంలో సుమారు 90శాతం థర్మల్ విద్యుత్కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవే. కొత్తగూడెంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీఎస్ – 1720 మెగావాట్లు), భూపాల్‌పల్లిలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ-500 మెగావాట్లు), రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీసీ- 62 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ థర్మల్ పవర్‌ప్లాంటు (వీటీపీఎస్- 1760 మెగావాట్లు) ఇవన్నీ సబ్‌క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవే. వెరసి దేశంలోనూ, ఎన్టీపీసీ పరిధిలోనూ 90 శాతం థర్మల్ ప్లాంట్లు సబ్ క్రిటికలే కాగా, ఒకటి రెండు మాత్రమే సూపర్ క్రిటికల్ విద్యుత్కేంద్రాలున్నాయి. సూపర్ క్రిటికల్ పరిజ్ఞానం కింద నిర్మాణాలు అప్పుడప్పుడే మొదలవుతున్నయి. కాలుష్య నియంత్రణలో భాగంగా, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం, 2015లో కుదిరిన పారిస్ ఒప్పందంలో భారత్ చేరిన పర్యవసానంగా దేశంలో సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రాలను ప్రోత్సహించాలనే ఆలోచన వచ్చింది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలో విద్యుత్తు కొరతను తీర్చడానికి ఒకవైపు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటూనే, మరోవైపు విద్యుదుత్పత్తిలో స్వావలంబన సాధించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా వీలైనంత వేగంగా కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించబడింది. అప్పటికి దేశంలో భారీ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో పేరెన్నిక గన్న సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్). కేంద్ర ప్రభుత్వ రంగ విభాగం అయిన ఇది నవరత్నాల్లో ఒకటి. బీహెచ్ఈఎల్కున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా, తెలంగాణలో కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి దాన్ని సంప్రదించడం జరిగింది. ‘మా రాష్ర్టానికి విద్యుత్తు అవసరం చాలా ఎక్కువగా ఉంది. సత్వరమే విదుత్కేంద్రాల నిర్మాణం జరగాల్సి ఉంది. మీరు చేయగలరా?’ అని ఆరా తీయడం జరిగింది. దానికి బీహెచ్ఈఎల్ వారు… ‘మా వద్ద సబ్‌క్రిటికల్ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి సిద్ధంగా ఉంది. మీకు అత్యవసరం ఉంది కనుక దాంతో రెండేండ్లలోనే మీకు మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంటు నిర్మించి ఇవ్వగలం. కొత్తగూడెంలో ప్రతిపాదించిన 800 మెగావాట్ల ఏడో దశను మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంటును నాలుగేండ్లలో ఇవ్వగలం’ అని జవాబిచ్చారు. దీంతో అప్పుడు తెలంగాణలో ఉన్న తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, సత్వరమే కరెంటును అందుబాటులోకి తెచ్చుకోవడం కోసం మణుగూరులో సబ్‌క్రిటికల్ పద్ధతిలో థర్మల్ ప్లాంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది.
అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది. అదీగాక 2014 నాటికి సబ్ క్రిటికల్‌పై ఎలాంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదు. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళిక కూడా, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని పేర్కొంది. అయితే మీరు 11-6-24 రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేను పైన తెలిపిన ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్‌పై విపరీత వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన నాటికి మన రాష్ట్రంతో పాటు యావత్తు దేశవిద్యుత్తు రంగమే 90 శాతం సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ల విద్యుత్తు ఉత్పత్తిపైనే ఆధారపడి ఉందన్న సంగతిని మీరు పూర్తిగా విస్మరించారు. ఒకవైపు దేశంలో 90 శాతం సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్‌క్రిటికల్ ప్లాంట్ పెట్టినట్టు చేయరాని తప్పు ఏదో చేసినట్టు మీరు మాట్లాడిన తీరు దురుద్దేశాన్ని బయటపెట్టింది. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని మీరు విస్మరించారు. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవసరమైన అన్ని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు, ఆమోదాలు పొందిన తర్వాతనే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పని ప్రారంభించి, విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేసిన సంగతినీ మీరు విస్మరించడమే కాకుండా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎదో తప్పుచేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారు. అందువల్ల మీరు ఈ అంశాన్ని విచారించే విచారణార్హతను కోల్పోయారు. కాబట్టి మీరు మీ బాధ్యతలనుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
భద్రాద్రిలో సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల కలిగే అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణ జన్కోలోని నెగోషియేషన్స్ కమిటీ, వాళ్లు అవలంబించే ఫార్ములా ద్వారా అంచనా వేసి, బి.హెచ్.ఈ.ఎల్తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో రూ. 400 కోట్లను తగ్గించారు. అందుకు బి.హెచ్.ఈ.ఎల్. అంగీకరించిన తర్వాతనే భద్రాద్రి ప్లాంట్ పనులు ప్రారంభించబడ్డాయి. ఈ వాస్తవాన్ని మీరు విస్మరించి మీకై మీరే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి, సబ్ క్రిటికల్ ప్లాంటు.. తద్వారా రాష్ర్టానికి ఏదో భారీ నష్టం వాటిల్లిందనన్నట్టుగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు అసమంజసం కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరూ కూడా వాటిని అంగీకరించరు. ఈ కారణం చేత కూడా మీరు విచారణార్హతను కోల్పోయినందువల్ల ఈ బాధ్యత నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే దశలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్తు లోటుతో ఉందన్నది అందరికి తెలిసిందే. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడానికి, పీక్ లోడ్ లాంటి అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి, తెలంగాణ విద్యుత్తు సంస్థలు గత్యంతరంలేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజిల ద్వారా కరెంటు కొనుగోలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే సమయంలో బి.హెచ్.ఈ.ఎల్. ముందుకొచ్చి కేవలం రెండేళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన దరిమిలా అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా ఉండడానికి బి.హెచ్.ఈ.ఎల్.కు నామినేషన్ పద్ధతిలో భద్రాద్రి పనులను అప్పగించడం జరిగింది. దీంతోపాటు మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం మా పార్టీ పాలసీ కాబట్టి, బి.హెచ్.ఈ.ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిపై పనులు ఇవ్వడం జరిగింది.
విలేఖరుల సమావేశంలో మీరు చెప్పినట్టుగానే బి.హెచ్.ఇ.ఎల్ రెండు సంవత్సరాల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడం వల్ల వారికి పనులు అప్పగించడం జరిగింది. అయితే మీరు చేసిన వ్యాఖ్యల్లో, సత్వరం అవుతుందని ఇచ్చారు గానీ, అనుకున్నంత వేగంగా అది పూర్తి కాలేదన్నట్టు, దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు మీరు మాట్లాడారు. ఇలా మాట్లాడేటప్పుడు భద్రాద్రి మీద ఎన్.జి.టి. విధించిన స్టే ఆర్డర్నుగానీ, కరోనా మహమ్మారి వల్ల కలిగిన అంతరాయాన్ని గానీ మీరు పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం.
2014లో రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంతటి తీవ్ర కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో నేను మీకు ముందే వివరించాను. అప్పటికి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ కాకుండా, కేవలం దక్షిణ గ్రిడ్‌లోనే ఉంది. దీంతో ఈ కరెంటు లోటును పూడ్చుకోవడానికి దక్షణాదిలో ఎక్కడైన విద్యుత్తు అందుబాటులో ఉందా పరిశీలించాలని అప్పటి మా ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించింది.…