తక్షణమే జోక్యం చేసుకోండి…నూతన క్రిమినల్‌ చట్టాలపై స్టే విధించేలా చూడండి

తక్షణమే జోక్యం చేసుకోండి…నూతన క్రిమినల్‌ చట్టాలపై స్టే విధించేలా చూడండి

ఇండియా బ్లాక్‌ నాయకులు, ఎన్డీఏ మిత్రపక్షాలను కోరిన.

పౌర సమాజంలోని 3600 మందికి పైగా ప్రముఖుల లేఖ.

న్యూఢిల్లీ :

మోడీ సర్కారు త్వరలో అమలులోకి తీసుకురాబోతున్న నూతన క్రిమినల్‌ చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా పౌర సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.

కొత్త క్రిమినల్‌ చట్టాలు వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతున్న విషయం విదితమే. అయితే, ఈ చట్టాలను నిలిపివేసేలా తక్షణ జోక్యం చేసుకోవాలని ఇండియా బ్లాక్‌ నాయకులు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలను పౌర సమాజ ప్రముఖులు కోరారు.

ఈ మేరకు 3600 మందికి పైగా తమ సంతకాలతో కూడిన లేఖలను పంపారు. వీరిలో తుషార్‌ గాంధీ, తానికా సర్కార్‌, హెన్రీ టిఫాగే, మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) సుధీర్‌ వొంబత్కెరే, తీస్తా సెతల్వాడ్‌, కవితా శ్రీవాస్తవ, షబ్నమ్‌ హష్మీలతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆర్ఎల్డీ జాతీయ చైర్మెన్‌ జయంత్‌ చౌదరి, ఇండియా బ్లాక్‌లోని అన్ని భాగస్వామ్య పక్షాలకు వీరు తమ ఆందోళనలను వెలిబుచ్చారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీపీఐ(ఎం) సెక్రెటరీ జనరల్‌ సీతారాం ఏచూరి, ఆఫ్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రధాన కార్యదర్శి, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌ అధ్యక్షుడు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్‌ సోరెన్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్చంద్ర పవార్‌) చీఫ్‌ శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ థాక్రే సహా పలు ఇండియా, ఎన్డీఏ మిత్రపక్షాలకు పౌర సమాజ ప్రముఖులు తమ పిటిషన్‌ను పంపారు. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ‘ప్రజావ్యతిరేక’ కొత్త క్రిమినల్‌ చట్టాలను నిలిపివేసేందుకు తక్షణ జోక్యం చేసుకోవాలని వారు అందులో కోరారు.

జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ, న్యాయ నిపుణుల సంప్రదింపులు, పార్లమెంట్‌లో ప్రతిపాదిత సంస్కరణలపై అర్థవంతమైన చర్చ జరగాలని అభ్యర్థించారు. ” ‘భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, 2023’, ‘భారతీయ న్యాయ సంహిత, 2023’, ‘భారతీయ సాక్ష్యా అధినియం, 2023’ అనే మూడు కొత్త క్రిమినల్‌ చట్టాల రూపంలో దేశంపై తీవ్రమైన ముప్పు ఉన్నది. చర్చ లేకుండానే 2023 డిసెంబర్‌ 20న పార్లమెంట్‌లో హడావిడిగా వీటిని తీసుకొచ్చారు.

ఈ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రావడానికి షెడ్యూల్‌ చేయబడ్డాయి. ప్రధాన ఆందోళన ఏమిటంటే, అప్పటి చట్టాలలో చేసిన సవరణలు చాలావరకు క్రూరమైన స్వభావం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా, ప్రభుత్వం కొత్త చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఎంచుకుంటే.. ఈ కొత్త క్రిమినల్‌ చట్టాలు మన ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయటానికీ, భారత్‌ను ఫాసిస్ట్‌ రాజ్యంగా మార్చటానికి ప్రభుత్వానికి తగిన శక్తినిస్తాయి. ప్రతిపాదిత కొత్త చట్టాలు చట్టాన్ని గౌరవించే ప్రజాస్వామ్య ప్రత్యర్థులు, అసమ్మతివాదులు, కార్యకర్తలను నాటకీయంగా అరెస్టు చేయటం, నిర్బంధించటం, ప్రాసిక్యూషన్‌, జైలు శిక్షను నాటకీయంగా పెంచటానికి ప్రభుత్వానికి అనుమతినిస్తుంది” అని పౌర సమాజ ప్రముఖులు పేర్కొన్నారు.