హస్తం గూటికి సంజయ్… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు ఉమ్మడి జిల్లాలో మిగిలేది ఎవరు.?
కల్వకుంట్లనేనా.!
జగిత్యాల :
ఉద్యమాల జిల్లా జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కంటి వైద్య నిపుణులు సంజయ్ కుమార్ హస్తం గూటిలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతం నుండి అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బి ఆర్ ఎస్ పార్టీ నుండి జగిత్యాల నియోజకవర్గం నుండి తలలు పండిన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఓడించి రెండు పర్యాయాలు గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ ,కూరవృద్ధుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కారును దిగి రేవంత్ రెడ్డి తో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. తాజాగా ఆదివారం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారడంతో కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో రాజకీయ పరిస్థితులు మారనున్నాయి.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పార్టీని మారుతారు అన్న ఊహాగానాలు వినిపించాయి. ఏది ఏమైనా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నియోజకవర్గం నుండి గంగుల కమలాకర్ ,జగిత్యాల నియోజకవర్గం నుండి డాక్టర్ సంజయ్ కుమార్ ,సిరిసిల్ల నియోజకవర్గం నుండి కల్వకుంట్ల తారక రామారావు, కోరుట్ల నియోజకవర్గం నుండి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లు గెలుపొందారు. వీరు నుండి తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరడంతో కరీంనగర్ జిల్లాలో రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు మారనున్నట్లు తెలుస్తుంది.
గంగుల కమలాకర్ గతంలో హస్తం గూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా పొన్నం బహిరంగంగా అడ్డుపడ్డట్లు చర్చ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కావలసిన మద్దతును, మార్క్ పరిపాలన కొనసాగించేందుకు ఆయన ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచిన నలుగురు బి ఆర్ ఎస్ అభ్యర్థుల్లో గంగుల కమలాకర్ కాంగ్రెస్ గూటికి కమలం గూటికి త్వరలో చేరుతారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిరిసిల్ల కోరుట్ల నియోజకవర్గాల నుండి కల్వకుంట్ల తారక రామారావు డాక్టర్ కల్వకుంట్ల సంజయులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తన ప్రాణం ఉన్నంతవరకు బి ఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తుంటే ఆయన కూడా పార్టీ మారుతారు అన్న అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ అధినేత తనయ కూడా లిక్కర్ స్కాం నుండి బయటకు వచ్చిన తర్వాత పార్టీ మారే ఆలోచనలు ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయినా( టిఆర్ఎస్) జాతీయ పార్టీగా మారిన (బి ఆర్ఎస్) లేకుండా చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుంది.