BRS పార్టీ ఈ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుంది… KCR

తెలంగాణలో BRS పార్టీ ఈ సారి మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని BRS అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR ధీమా వ్యక్తం చేశారు .

కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు.

గతంలో NTR పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని BRS పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా KCR మాట్లాడుతూ….

BRS ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని , విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు.

పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు , తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తున్నదని అన్నారు.

అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలన్నారు.

గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో BRS ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు.

పార్టీ నాయకులను సృష్టిస్తుంది కాని నాయకులు పార్టీని సృష్టించరని , మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు.

అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే అసహించు కుంటున్నారని అన్నారు.

రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం , గాంభీర్యం ఉండాలని అలా కాకుండా కొందరు KCR ఆనవాళ్లను చెడిపేస్తామంటున్నారని KCR తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దాన్నే చెడిపేస్తరా అని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వచ్చినంక గతంలో వై ఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ , ఫీజు రీ అంబర్స్ మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా ఇంకా బాగా అమలు చేశామని గుర్తు చేశారు.

తెలంగాణ వచ్చే నాటికి చెట్టుకొకడు పుట్టకొకడు అయ్యిండనే బాధతో వ్యవసాయాన్ని స్థిరీకరణ చెయ్యాలని రైతుబంధు పథకాన్ని అద్భుతంగా రైతులందరికీ అందించామన్నారు.

ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రకరకాల కారణాలతో అసలు ఆ పథకానికే ఎగనామం పెట్టె ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు ఏడాది పొడవునా పంటలను సాగు చేస్తూనే ఉంటారని సాగు లెక్కలు ఇతరత్రా కారణాలు చూపుతూ రైతుబంధు ను అమలు చేస్తే అవినీతి మొదలైతదని అన్నారు.

మళ్ళీ BRS పార్టీనే అధికారంలోకి వస్తుందని కొంచెం సమన్వయంతో ఓపిక పట్టాలని అన్నారు . మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని అన్నారు.

మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉన్నదని ఈ సారి BRS తరపున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయమన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

పార్టీ అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు.

సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామన్నారు.

బంగ్లాదేశ్ లో హష్మీ అనే ఒక ప్రొఫెసర్ పేద మహిళల కోసం 71 వేల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకున్న విధానం గురించి , జీరో పొల్యూషన్ నగరాల్లో అక్కడి మేయర్లు
ప్రజల్లో మమేకమైన విధానం గురించి KCR వివరించారు.

జడ్పీ చైర్మన్లను ఘనంగా సన్మానించిన BRS అధినేత

తెలంగాణ రాష్ట్రంలోని BRS  జడ్పీ చైర్మన్లను బి ఆర్ ఎస్ అధినేత KCR గారు ఎర్రవెల్లి లోని వారి నివాసంలోశాలువా కప్పి ఘనంగా సన్మానించారు . కుటుంబ సభ్యులతో సహా ఈ సమావేశానికి ఆహ్వానించడంతో జడ్పీ చైర్మన్లు వారి కుటుంబ సభ్యులు KCR గారితో కలిసి ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా KCR జడ్పీ చైర్మన్లను పేరు పేరునా పలకరించారు.

ఆయా జిల్లాల్లో జరిగిన అభివృద్ధిలో భాగం పంచుకుని మంచిగ పని చేసినందుకు వారిని అభినందించారు.

బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో వారి యోగ క్షేమాలను చర్చిస్తూ ఎక్కువ సేపు గడిపారు.

ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించారు . భోజన సమయంలో అందరితోనూ ఆత్మీయంగా సంభాషిస్తూ కనిపించారు.

సమావేశం అనంతరం కేటీఆర్ జడ్పీ చైర్మన్లందరికీ యాదాద్రి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను అందజేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధినేత కేసీఆర్ గారిని కలవడం సంతోషంగా ఉందని జడ్పీ చైర్మన్లు , వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు .

జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి , బాల్క సుమన్ , గండ్ర వెంకట రమణారెడ్డి , పైళ్ల శేఖర్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య , బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు , మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

సమావేశానికి హాజరైన జడ్పీ చైర్మన్లు

జడ్పీ చైర్మన్లు బడే నాగజ్యోతి (ములుగు )జనార్దన్ రాథోడ్ ( ఆదిలాబాద్ ), కోరిపెల్లి విజయ లక్ష్మి (నిర్మల్ ), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్ ), దపేందర్ శోభ ( కామారెడ్డి ), దావా వసంత సురేష్ (జగిత్యాల ), పుట్టా మధుకర్ (పెద్దపల్లి ), కనుమళ్ల విజయ (కరీం నగర్ ), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల ), పటోళ్ల మంజుశ్రీ ( సంగారెడ్డి ), ర్యాకల హేమలత , వేలేటి రోజారాణి ( సిద్దిపేట ), శాంతాకుమారి (నాగర్ కర్నూల్ ), బండా నరేందర్ రెడ్డి (నల్గొండ ), గుజ్జ దీపిక (సూర్యాపేట ), ఎలిమినేటి సందీప్ రెడ్డి ( యాదాద్రి భువనగిరి ), ఆంగోత్ బిందు (మహబూబాబాద్ ) , గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్ ), మారపల్లి సుధీర్ కుమార్ (వరంగల్ అర్బన్ ), జక్కు శ్రీహర్షిని ( జయశంకర్ భూపాలపల్లి ) , లింగాల కమల్ రాజ్ (ఖమ్మం )