హైదరాబాద్ :
ఇక నుంచి CBI కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ… తెలంగాణ హైకోర్టు ఆదేశం
మాజీ సీఎం జగన్ కేసుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేసింది.
సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశం జారీ చేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కోర్టులో ఉన్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేసులను రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్పై సీబీఐ కోర్టులో 20 కేసులున్నాయని, కొన్నేళ్లుగా ఈ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య గతేడాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.
విచారణలో ఎలాంటి పురోగతి లేదనివీలైనంత త్వరలో విచారణ పూర్తి చేసేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని పిటీషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. రోజు వారీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై పలు కోర్టులలో ఉన్న కేసులను కూడా హైకోర్టు ఈ సందర్భంగా విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు గతేడాది హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆయా కోర్టులు ఆదేశించింది. విచారణకు సంబంధించిన నివేదికు సమర్పించాలని మూడు వారాలకు వాయిదా వేసింది.