హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్… వయా రాజధాని అమరావతి

హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్… వయా రాజధాని అమరావతి

రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను కలుపుతూ ప్రస్తుతం ఉన్న ఆరు లైన్ల జాతీయ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చి.. గ్రీన్‌ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దేందుకు ఏపీ, తెలంగాణ సీఎం లు ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ ప్రతిపాదనను త్వరలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి దృష్టికి తేనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు మాత్రమే కాక సరుకు రవాణాకు సైతం ఈ ప్రతిపాదన దోహదపడుతుందన్నది ఇరు రాష్ట్రాల సీఎం ల అభిప్రాయం. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య రోడ్డు కనెక్టివిటీని పెంపొందించే అంశాన్ని విభజన చట్టంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రోడ్డు కనెక్టివిటీ గతంతో పోలిస్తే మెరుగుపడినా ఇప్పుడు అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలన్నది రెండు రాష్ట్రాల ప్రతిపాదన.

అనుమతుల విషయంలో చంద్రబాబు చొరవ

కేంద్రానికి అధికారకంగా ప్రతిపాదనలు వెళ్లిన తర్వాత అనుమతుల విషయంలో చంద్రబాబునాయుడు చొరవ తీసుకునే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న ఆరు లైన్లను ఎనిమిది లైన్లకు విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ విషయంలో రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటాయి. తెలంగాణలో సరుకు రవాణా కోసం ఒక డ్రైపోర్టు నిర్మించాలన్న ప్రతిపాదన దీర్ఘకాలంగానే ఉన్నది. ఇది కార్యరూపం దాల్చి వినియోగంలోకి వస్తే ఇతర రాష్ట్రాలు, దేశాలకు మచిలీపట్నం రేవు ద్వారా రవాణా చేయడానికి ఎనిమిది లైన్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే దోహపడనున్నది. ఈ మౌలిక సదుపాయంతో రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందని ఇద్దరు ముఖ్యమంత్రుల అభిప్రాయం. ఇటీవల ప్రజాభవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో ఈ అంశం ప్రస్తావనకు రావడమే కాక లోతుగా చర్చ జరిగి ఏకాభిప్రాయం కుదిరినట్లు అధికార వర్గాల సమాచారం.

సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందనే భావన

హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్.. వయా రాజధాని అమరావతిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ప్రజల్లో భిన్నమైన సెంటిమెంట్లు ఉన్నాయని ఇద్దరు సీఎంలు మొన్న జరిగిన మీటింగ్‌లో పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని, అభివృద్ధి ఫలాలు రెండు రాష్ట్రాల ప్రజలకు అందడం ద్వారా సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందనేది వీరి భావన. రాష్ట్రాలు పరస్పరం ఘర్షణ పడడం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని, ఒకదానికొకటి సహకరించుకోవడం ద్వారా సమస్యలు, వివాదాలు లేకుండా అభివృద్ధి చెందుతాయన్న అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ కలిగించడం ప్రభుత్వాల బాధ్యత అనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం ఆరు లైన్ల రహదారి నిర్మాణం ఒక్కో జిల్లాలో ఒక్కో తరహాలో ఉన్నందున వాటిని అంచనా వేసుకుంటూనే కేంద్రం ద్వారా ఎనిమిది లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మార్చాల్సిన ఆవశ్యకత పై ఇద్దరు సీఎంలు చర్చించుకోవడం గమనార్హం.

ఇటీవలే గడ్కరికి సీఎం విజ్ఞప్తి

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఇటీవలే ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయడమే కాకుండా కొన్ని రాష్ట్ర రహదారులనూ జాతీయ రహదారులు గా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి అప్పగించాలని ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు చేసిన రిక్వెస్టులో సైతం హైదరాబాద్ నుంచి పలు జిల్లాలను కలపడానికి ఉద్దేశించే రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లై ఓవర్ల అవసరాలను వివరించారు. ఇప్పుడు హైదరాబాద్, అమరావతి మధ్య ఎనిమిది లైన్ల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే సాకారమైతే ప్రజల రాకపోకలకు మాత్రమే కాక తెలంగాణలోని డ్రైపోర్టు నుంచి మచిలీపట్నంలోని ఓడ రేవు వరకు సరుకు రవాణాకు మార్గం సుగమమవుతుందని, ఎగుమతులు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందన్నది రెండు రాష్ట్రాల అభిప్రాయం.

త్వరలో కేంద్ర మంత్రి వద్దకు ప్రతిపాదనలు

హై స్పీడ్ రోడ్ కనెక్టివిటీ విషయంలో త్వరలో రెండు రాష్ట్రాల తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ప్రతిపాదనలు వెళ్లనున్నాయి. ఈ విషయం పై సానుకూల స్పందన వస్తుందని, ఏపీ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటారనే అభిప్రాయం రెండు రాష్ట్రాల్లోనూ వ్యక్తమవుతున్నది