భారతీయుడు :
భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..
కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘భారతీయుడు’ గురించి పలు ఆసక్తికర విశేషాలు..
ఇంటర్నెట్ డెస్క్: సినిమాలనేవి ఆనందం కోసమే కాదు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉండాలనుకునే దర్శకుల్లో శంకర్ (Shankar) ముందుంటారు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు.
‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)తో మరోసారి తనదైన మార్క్ సందేశాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మూవీ విడుదల కానున్న సందర్భంగా.. అసలు ‘భారతీయుడు’ (Bharateeyudu) కథ ఎలా మొదలైంది? ముందుగా ఏ హీరోలను తీసుకోవాలనుకున్నారు? ఆ మూవీ సృష్టించిన రికార్డులేంటి?వంటి ఆసక్తికర అంశాలు..
తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’తోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు శంకర్. ఈ డైరెక్టర్ ప్రతిభను గుర్తించిన రజనీకాంత్ (Rajinikanth) ఆయనతో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపారట. ఓ వైపు ‘ప్రేమికుడు’ సినిమాని తెరకెక్కిస్తూనే.. రజనీకాంత్ కోసం ‘పెరియ మనుషన్’ అనే స్క్రిప్టు రెడీ చేశారు శంకర్.
కానీ, ఆ సమయంలో రజనీకాంత్ వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండడంతో శంకర్ సినిమా పట్టాలెక్కించేందుకు ఆలస్యమవుతూ వచ్చింది.ఆ కథలో కొన్ని మార్పులు చేసి, ఇండియన్ (భారతీయుడు)గా మార్చారని సమాచారం. సేనాపతిగా రాజశేఖర్, ఆయన కుమారుడి పాత్రలో వెంకటేశ్ (Venkatesh) లేదా నాగార్జునను (Nagarjuna) తీసుకోవాలనుకున్నారు. ఆ కాంబో వర్కౌట్ కాలేదు. తర్వాత తమిళ నటులు కార్తిక్, సత్యరాజ్‌లను ఎంపిక చేద్దామనుకున్నా అదీ సాధ్యపడలేదు. చివరకు కమల్ హాసన్ (Kamal Haasan)ను సంప్రదించగా స్క్రిప్టు బాగా నచ్చడంతో ఆయనే ద్విపాత్రాభినయం చేసేందుకు ఆసక్తి చూపారు.
ముందుగా ఓ హీరోయిన్గా ఐశ్వర్యారాయ్‌ను ఎంపిక చేయాలని భావించినా యాడ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ అప్పటికి పూర్తికాకపోవడంతో ఆమె నటించలేకపోయారు. దీంతో, ‘బొంబాయి’లోని మనీషా కొయిరాల (Manisha Koirala) నటనను మెచ్చిన శంకర్ ఆమెను తన సినిమాలో కథానాయికగా తీసుకున్నారు. బాలీవుడ్ మూవీ ‘రంగీల’తో ఉర్రూతలూగించిన ఊర్మిళ (Urmila Matondkar)ను రెండో హీరోయిన్గా నిర్మాత ఏఎం రత్నం ఎంపిక చేశారు. సేనాపతి భార్య పాత్ర కోసం ముందుగా రాధికను అనుకోగా చివరకు సుకన్య నటించారు.సేనాపతి హావభావాలు ప్రేక్షకుల హృదయాల్లో ఎలా నిలిచిపోయాయో ఆ పాత్ర ఆహార్యం అలానే నిలిచిపోయింది. అప్పటికి దాదాపు 40 ఏళ్ల వయసున్న కమల్.. ఆ క్యారెక్టర్ డిమాండ్ మేరకు 70 ఏళ్ల వృద్ధుడిగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డారు. ప్రోస్థెటిక్ మేకప్ వేసేందుకు కొన్ని గంటలు.. దాన్ని తీసేందుకు ఇంకొన్ని గంటల సమయం పట్టేదట.
కమల్ని సేనాపతిగా చూపించిందెవరో కాదు ఆస్కార్ విజేత, హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైఖేల్ వెస్ట్‌మోర్. ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళ గురించి ప్రజలు చర్చించుకునేలా చేసిన సినిమాల్లో ఇదొకటి. మాస్టర్ ఆసాన్ రాజేంద్రన్ వద్ద మర్మకళలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో శంకర్ ఎప్పుడూ ముందుంటారు. అప్పట్లో ఉన్న సాంకేతికత మేరకు.. సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఫుటేజీలోని కొన్ని దృశ్యాలను తీసుకుని వాటిల్లో కమల్ హాసన్‌ను చూపించారు.1996 మే 9న బాక్సాఫీసు ముందుకొచ్చిన ‘భారతీయుడు’.. కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే ఏడాదిలో ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ విభాగంలో ఆస్కార్‌కు ఎంట్రీ పొందినా.. నామినేట్ కాలేదు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌లో జాతీయ పురస్కారాలు సొంతం చేసుకుంది.ఈ సినిమా
విజయంలోనూ సంగీతం కీలక పాత్ర పోషించింది. ఎ.ఆర్. రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లగా.. పాటలు విశేషంగా అలరించాయి. ‘పచ్చని చిలుకలు తోడుంటే..’ సాంగ్ ఎవర్గ్రీన్. విడుదలైన కొన్ని రోజుల్లోనే పాతిక లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోయాయంటే ‘భారతీయుడు’ మ్యూజిక్ ఏ రేంజ్లో మ్యాజిక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు…