తెలంగాణ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షించి చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగం అంటూ వేర్వేరుగా చూడకుండా రెండింటినీ కలిపి ఒకే నెంబర్ కేటాయించాలన్న ప్రతిపాదనకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిగారు చెప్పారు. అందుకోసం కేంద్ర, రాష్ట్ర, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య కుదుర్చుకోవలసిన త్రైపాక్షిక ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలైన్‌మెంట్ విషయంలో కొందరు రైతులు పొరపడి హైకోర్టును ఆశ్రయించారని అధికారులు వివరించగా స్టే ఉత్తర్వులను ఎత్తివేయించడానికి సాధ్యమైనంత తొందరగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులతో పాటు అటవీ భూముల బదలాయింపు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూముల కేటాయింపు, పరిహారం చెల్లింపు, ఇతర సాంకేతిక సమస్యలన్నింటిపైనా సమగ్రంగా సమీక్షించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న రహదారులతో పాటు అవార్డయిన రోడ్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాల్సిన వాటన్నింటిపైనా సమీక్షించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి గారు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగ్‌పూర్ – విజయవాడ కారిడార్‌కు సంబంధించి ఖమ్మం జిల్లాలో భూ సేకరణ, అలైన్‌మెంట్, సర్వీసు రోడ్లు, అండర్ పాస్‌ల నిర్మాణంలో పరిగణలోకి తీసుకోవలసిన అంశాలను మంత్రులు ఎన్.హెచ్.ఏ.ఐ మెంబర్ ప్రాజెక్ట్స్ అనిల్ చౌదరికి పలు సూచనలు చేశారు.