BSNL పూర్వ వైభవం రానుందా…? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు

BSNL పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…

దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి.

పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్‌ యూజర్లపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను BSNL మాత్రమే కలిగి ఉండేది. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్‌లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కేవలం రెండు వారాల్లో 1 లక్షా 15 వేల మంది కస్టమర్లు తమ సిమ్‌లను బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ చేసుకున్నారు.

భోపాల్‌లోనే రెండు వారాల్లో 30 వేల మంది కస్టమర్లు తమ నంబర్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ప్రతి రోజు డజన్ల కొద్దీ కస్టమర్లు వస్తున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ బృందం పలు రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించింది. ఇతర కంపెనీల ప్లాన్‌లు ఖరీదైనవి కాబట్టి ఇప్పుడు మేము బీఎస్ఎన్ఎల్ కి మారుతున్నామని వినియోగదారులు మీడియా సంస్థతో తెలిపారు. భోపాల్ బీఎస్ఎన్ఎల్ పీజీఎం మహేంద్ర సింగ్ ధాకడ్‌ మాట్లాడుతూ.. మెరుగైన నెట్‌వర్క్‌ను అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. “కస్టమర్‌లు మళ్లీ బీఎస్ఎన్ఎల్ ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు ఒక నెలకు వసూలు చేస్తున్న ప్లాన్‌ను మేము 3 నెలలకు అందిస్తున్నాము. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత కూడా సంస్థ మరింత బలపడుతోంది.” అని పేర్కొన్నారు.