కరోనా సమయంలో భారత్‌లో మరణాలు 11 లక్షలు… అధ్యయనాన్ని తోసిపుచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ :
ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది. ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగింది. ఆ సమయంలో భారతదేశంలో చాలామంది ప్రజలు కోవిడ్ బారినపడి మరణించారు. భారతదేశంలో కోవిడ్ వైరస్ కారణంగా 5.3 లక్షల మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కోవిడ్ సమయంలో భారత్‌లో మరణాల సంఖ్య నివేదించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు ఓ అంతర్జాతీయ అధ్యయం తాజాగా వెల్లడించింది. 2020 లో 11.9 లక్షల అధిక మరణాలు భారతదేశంలో చోటుచేసుకున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. ఇది తప్పుదోవ పట్టించే నివేదిక అని కొట్టిపారేసింది.
అధ్యయనం ఎవరు చేశారంటే…?
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు భారతదేశంలో కరోనా సమయంలో జరిగిన మరణాల సంఖ్యపై అధ్యయనం నిర్వహించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) – 5 నివేదికను విశ్లేషించి భారత్‌లో కరోనా విజృంభణ సమయంలో అత్యధికంగా 11.9 లక్షల మరణాలు చోటుచేసుకున్నట్లు నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు. కొన్ని మీడియా కథనాలు ఈ అధ్యయనాన్ని ప్రచురించాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అధ్యయనాన్ని తోసిపుచ్చింది. దీన్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన….
”ఆ అధ్యయనం చేసిన అంచనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. లోపభూయిష్టమైన పద్ధతిలో వారు చేసిన అధ్యయనం ఆమోదయోగ్యం కాదు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం దేశానికి ఆపాదించలేం. అంతేగాక, దేశంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అత్యంత విశ్వసనీయమైనది. దేశంలో 99 శాతం మరణాలు ఇందులో రికార్డ్ అవుతాయి. దీని ప్రకారం 2019తో పోలిస్తే 2020లో మరణాలు 4.74లక్షలు పెరిగాయి. అంతకుముందు రెండు సంవత్సరాల్లోనూ (2018లో 4.86లక్షలు, 2019లో 6.90లక్షల పెరుగుదల) మరణాల్లో ఇలాంటి అత్యధిక పెరుగుదల నమోదైంది. అయితే, అధికంగా నమోదైన మరణాలన్నింటికీ కోవిడ్ మహమ్మారి కారణమని చెప్పలేం. ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ ఉంటాయి” అని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.