హైదరాబాద్ :
మరో రెండు రోజులపాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. సిటీకి ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officials ) తెలిపారు.
కాగా మూడు రోజులుగా నగరాన్ని ముసురు వీడడంలేదు. జంట జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) అయితే నిండు కుండలా తలపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్‌లోకి వరద నీరు వస్తోంది.
హుస్సేన్ సాగర్‌కు ఇన్ ఫ్లో 1517 క్యూసెక్కుల వరద నీరు ఉండగా.. ఫుల్ ట్యాంక్ లెవెల్‌కు చేరువలో నీటి మట్టం ఉంది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.23 మీటర్లు.. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉంది. దీంతో అధికారులు. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఔట్ ఫ్లో 998 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు.
కాగా శుక్రవారం రాత్రి మొదలై శనివారం అంతా కురుస్తూనే ఉంది..! కొన్నిచోట్ల జల్లులుగా.. ఇంకొన్నిచోట్ల భారీ వర్షంగా..! దీంతో రాష్ట్రం తడిసి ముద్దయింది..! జన జీవనం స్తంభించింది..! ఎటుచూసినా చెరువులు, వాగులు జల కళ సంతరించుకున్నాయి. చాలాచోట్ల భూగర్భ జల మట్టం పెరిగింది. వర్షాలు మెట్టపంటలకు ఊపిరి పోశాయి.
వరి నాట్లు ఊపందుకోనుండగా పత్తి సాగుకు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షం వీడడం లేదు. చర్ల మండలంలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుమ్ముగూడెంలో 9, మణుగూరు, జూలూరుపాడు, వేంసూరు, కామేపల్లిలో 7, సింగరేణి, పినపాకలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లాలో సగటున 4.9, భద్రాద్రి కొత్తగూడెంలో 4.5 సెంటీమీటర్ల వాన పడింది. ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లోనూ 3 సెంటీమీటర్లపైన వర్షం కురవడం విశేషం. హైదరాబాద్ మహా నగరంలో శనివారమంతా ఒకటే వాన. గొడుగులు లేకుండా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
షేక్ పేట, యూసుఫ్‌గూడలో 3 సెం.మీ. వర్షం కురిసింది. హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం 513.41 అడుగులు కాగా, 513.23 అడుగులకు చేరింది. వరంగల్ జిల్లాలో చాలా మండలాల్లో 2 సెం.మీ.పైనే వర్షం పడింది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు చినుకులు పడ్డాయి. చాలాచోట్ల రెండు సెం.మీ.కు పైన వర్షం కురిసింది. పాలమూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం మొదలైన వాన శనివారం కూడా ఆగలేదు. కోస్గిలో 5.86, వనపర్తిలో 49.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి నల్లగొండ నిజామాబాద్, ఆదిలాబాద్‌లో విరామం లేకుండా వానపడింది.