మాదకద్రవ్యాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1933

న్యూఢిల్లీ :

మాదకద్రవ్యాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1933

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు

మాదకద్రవ్యాల సరఫరాను నియంత్రించడంలో భాగంగా దీనిపై ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మానస్ (మాదక్ పదార్థ్ నిషేధ్ అసూచన కేంద్ర) పేరిట టోల్ ఫ్రీ నంబరు, ఈ మెయిల్, వెబ్సైట్ను ప్రారంభించింది. మాదకద్రవ్యాల తయారీ, సరఫరా, కొనుగోలు, విక్రయాలు, నిల్వ, స్మగ్లింగ్ తదితర అంశాలపై వీటి ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సాగుపై వివరాలు అందించవచ్చు. బాధితులు కౌన్సెలింగ్, రీహాబిలిటేషన్ కేంద్రాల సమాచారం పొందొచ్చు. ఈ కేంద్రం 24 గంటలూ పనిచేస్తుంది. ఫిర్యాదుదారులు డ్రగ్స్ బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సాగయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా ‘మ్యాప్రోగ్స్’ పేరుతో ప్రత్యేక వెబ్సైట్, యాప్ను కేంద్రం రూపొందించింది.

ఫిర్యాదు చేసే మార్గాలు…

టోల్ ఫ్రీ నంబర్… 1933

మెయిల్ ఐడి: info.ncbmanas@gov.in

వెబ్సైట్: ncbmanas.gov.in

ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.

రాష్ట్రాలకు నార్కొటిక్స్ ప్రైమరీ టెస్టింగ్ కిట్లు

తనిఖీల్లో మాదకద్రవ్యాలను గుర్తించేందుకు రాష్ట్ర పోలీసు విభాగాలకు నార్కొటిక్స్ ప్రైమరీ టెస్టింగ్ కిట్లను తక్కువ ధరకు అందించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. డ్రగ్స్ వాసన పసిగట్టేలా జాగిలాల బృందాలను రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పాటు ఇవ్వనుంది. ఇటీవల జరిగిన ఎన్సీవోఆర్డీ 7వ శిఖరస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది.