కోర్టుల్లో పెండింగ్‌లో 5 కోట్లకు పైగా కేసులు

కోర్టుల్లో పెండింగ్‌లో 5 కోట్లకు పైగా కేసులు

యూపీ దిగువ కోర్టులలో గరిష్టంగా 1.18 కోట్లు.. కేంద్రం సమాచారం

న్యూఢిల్లీ :

భారత్‌లోని న్యాయస్థానాల్లో కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

లోక్‌సభలో కేంద్రం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం..

దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఐదు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యూపీలోని సబార్డినేట్‌ కోర్టులలో గరిష్టంగా 1.18 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

సుప్రీంకోర్టులో 84,045 కేసులు పెండింగ్‌లో ఉండగా, వివిధ హైకోర్టుల్లో 60,11,678 పెండింగ్‌లో ఉన్నాయని న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. జిల్లా, సబార్డినేట్‌ కోర్టులలో అత్యధికంగా 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఫిజికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సపోర్టింగ్‌ కోర్ట్‌ స్టాఫ్‌ లభ్యత, ఇమిడి ఉన్న వాస్తవాల సంక్లిష్టత, సాక్ష్యాధారాల స్వభావం, బార్‌, ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలు, సాక్షులు, లిటిగేట్‌లతో సహా వాటాదారుల సహకారంతో సహా అనేక కారణాలు కేసుల పెండింగ్‌కు దారితీస్తున్నాయని మేఘవాల్‌ చెప్పారు.

కేసుల పరిష్కారంలో జాప్యానికి దారితీసే ఇతర అంశాలు వివిధ రకాల కేసుల పరిష్కారానికి కోర్టులు నిర్దేశించిన కాలపరిమితి లేకపోవటం, తరచూ వాయిదాలు వేయటం, విచారణ కోసం పర్యవేక్షించటానికి, ట్రాక్‌ చేయటానికి, కేసులను పర్యవేక్షించటానికి తగిన ఏర్పాట్లు లేకపోవటమని మంత్రి తెలిపారు.