ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ ముప్పు

ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ ముప్పు.

భారత్ లో గణనీయంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.

తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం ఉండదంటున్న నిపుణులు!

2020లో భారత్ లో 1.4 మిలియన్ క్యాన్సర్ కేసులు.

2025 నాటికి 1.57 మిలియన్లకు పెరిగే అవకాశముందని హెచ్చరిక.

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. భారత్ లో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు ఉందని తెలిపారు. అయితే, ఈ క్యాన్సర్ రకాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల వాటిలో చాలావరకు నివారించిదగినవేనని వివరించారు.

గత కొంతకాలంగా భారత్ లో క్యాన్సర్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ నేషన్ పేరిట రూపొందించిన నివేదికలో ప్రపంచానికే క్యాన్సర్ రాజధానిగా భారత్ ను పేర్కొన్నారు. 2020లో 1.4 మిలియన్ క్యాన్సర్ కేసులు ఉంటే, వాటి సంఖ్య 2025 నాటికి 1.57 మిలియన్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆ నివేదిక చెబుతోంది.

దీనిపై క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ ఇందు అగర్వాల్ స్పందిస్తూ… దేశంలో పొగాకును కట్టడి చేస్తే చాలావరకు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడ్డారు.

దేశంలో దాదాపు 267 మిలియన్ల మంది పొగాకు వినియోగిస్తుంటారని, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు పొగాకే కారణమని వివరించారు. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త జీవనశైలి క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని పేర్కొన్నారు.

క్యాన్సర్ మహమ్మారిపై పోరాడాలంటే ప్రజల్లో చైతన్యం కలిగించడం ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలని, క్యాన్సర్ ను గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం, క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూర్చడం ఎంతో అవసరమని డాక్టర్ ఇందు అగర్వాల్ పేర్కొన్నారు.