హైదరాబాద్‌లో కిడ్నాప్ అయిన పాప సురక్షితం… పోలీసుల అదుపులో కిడ్నాపర్..
హైదరాబాద్ :
అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన బాలిక ప్రగతి (6) ఆచూకీ లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమూల్ స్వ గ్రామంలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్, అబిడ్స్ కట్టెల మండిలో కిడ్నాప్‌కు గురైన బాలిక.. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యక్షమైంది. బాలికను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తున్నారు.
కాగా అబిడ్స్ పీఎస్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్, కట్టెలమండికి చెందిన ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. అగంతకుడు చాక్‌లేట్ ఇస్తామని చెప్పి పాపను కిడ్నాప్ చేశాడు. సీసీ టీవీ కెమెరాలో కిడ్నాప్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. కిడ్నాప్‌తో చిన్నారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి.. ఐదు బృందాలుగా బాలిక కోసం గాలించారు. ఆదివారం ఉదయం కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు.
వివరాల్లోకి వెళితే..
బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే మహిళ తన సోదరుడు కుమార్తె ప్రగతి( 6) తో కలిసి శనివారం సాయంత్రం తన తల్లి ఉంటున్న కట్టెల మండికి వచ్చింది. బాలిక ప్రగతితో ఆమె సోదరి కుమారుడు హృతిక్‌తో కలిసి ఇంటి సమీపంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద అడుకోడానికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. బాలిక ప్రగతి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా బాలిక కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన వారు అబిడ్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక ఆడుకున్న ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆగంతకుడు బాలికను ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అబిడ్స్ పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు..