తెలంగాణలో అమలవుతున్న మధ్యాహ్న భోజనం పథకం తరచూ వార్తల్లో నిలుస్తోంది..
భోజనంలో నాణ్యత లేకపోవటం.. కలుషిత ఆహారం.. ఇలా కారణం ఏదైనా.. తరచూ విద్యార్తులు అనారోగ్యానికి గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.
రాష్ట్రంలో వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటంతో..
అధికారులు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా.. ఇప్పుడు ఓ పాఠశాలలో సరైన భోజనం పెట్టకపోవటంతో.. విద్యార్థులు కారం, నూనె వేసుకుని తింటున్న ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం (ఆగస్టు 02న) రోజున..
సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారని.. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.
విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని.. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో కూడా తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని హరీష్ రావు ఆరోచించారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదని హరీష్ రావు ఆరోపించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి.. మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థతప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు నిత్యం ఏదో ఒక ఇబ్బందితో అవస్థ పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థత గురవుతూ ఆసుపత్రి పాలవుతున్నారు.
ఈ మధ్యనే వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురై జాండీస్ రాగా.. తాజాగా అదే పాఠశాలలో మరో నలుగురు విద్యార్థులు జాండీస్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు.
అంతేకాకుండా బూరుగుపల్లి సమీపంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 15 నుంచి 20 మంది విద్యార్థినిలు జ్వరాల భారిన పడి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అయితే పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్య, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం నీటి కలుషితం వల్లే అనారోగ్యాల పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.