బంగ్లా ఓ గుణపాఠం… కేంద్రాన్ని హెచ్చరించిన ఇండియా కూటమి నేతలు

బంగ్లా ఓ గుణపాఠం… కేంద్రాన్ని హెచ్చరించిన ఇండియా కూటమి నేతలు

భారత్‌లో కూడా జరగవచ్చు… సల్మాన్‌ ఖుర్షీద్‌

నిరంకుశత్వాలు ఎంతోకాలం కొనసాగవు… మెహబూబా

న్యూఢిల్లీ, శ్రీనగర్‌ :

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఒక హెచ్చరికలాగా తీసుకోవాలని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించేలా చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వానికి ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సూచించారు.

విద్యావేత్త ముజిబుర్‌ రెహ్మాన్‌ రాసిన ‘షిక్వా-ఎ-హింద్‌: భారతీయ ముస్లింల రాజకీయ భవిష్యత్తు’ అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఈ అంశంపై స్పందించారు. ‘బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది ఇక్కడా జరగవచ్చు. అయితే, భౌగోళికంగా మన దేశం చాలా పెద్దది కాబట్టి.. బంగ్లాదేశ్‌లో జరిగినట్టుగా ఇక్కడ ప్రజల అసంతృప్తి ఒక్కసారిగా పెల్లుబికటం లేదు’ అని పేర్కొన్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా మాట్లాడుతూ, ఢిల్లీలో సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా దీర్ఘకాలంపాటు జరిగిన షహీన్‌బాగ్‌ ఉద్యమాన్ని గుర్తు చేశారు. పార్లమెంటు నిస్తేజంగా మారినప్పుడు వీధులు చైతన్యంతో వెలుగొందుతాయన్నారు. బంగ్లాదేశ్‌ పరిణామాలను భారత్‌ ఒక గుణపాఠంలా తీసుకోవాలని.. నిరంకుశత్వాలు ఎక్కువకాలంపాటు కొనసాగవని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ చెప్పారు. బుధవారం మెహబూబా శ్రీనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలు కల్పించకుండా, పెరుగుతున్న ధరలను అరికట్టకుండా యువతను నిరుత్సాహపరుస్తూ.. అణిచివేస్తుంటే ఇలాంటివే సంభవిస్తాయన్నారు. ‘ప్రజావ్యతిరేక విధానాలను, చట్టాలను తెస్తూ ఉంటే ప్రజలు విసిగిపోతారు. అటువంటప్పుడు షేక్‌ హసీనాలాగా పారిపోయే పరిస్థితి వస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కూడా బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి’ అని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. షేక్‌హసీనా పదవీచ్యుతి పరిణామాలు ప్రపంచానికే ఒక సందేశం ఇచ్చాయని, ప్రజలే సుప్రీం.. వారి సహనాన్ని పరీక్షించవద్దని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో ప్రజాకోర్టు తీర్పునిచ్చిందని.. శ్రీలంక, ఇజ్రాయెల్‌లో కూడా ఇటువంటి నిరసనలు సంభవించాయని, ఆయా దేశాల ప్రధానులు ఇల్లు దాటి బయటకు రాలేకపోయారని గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడులు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపానంటూ ప్రచారం చేసుకున్న మోదీ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులను కాపాడాలని ఉద్ధవ్‌ సూచించారు.

ఖండించిన బీజేపీ నేతలు

సల్మాన్‌ ఖుర్షీద్‌ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌లో మంత్రిగా ఉన్న కైలాశ్‌ విజయవర్గీయ మాట్లాడుతూ, ‘ఇది మోదీ దేశం. భారత్‌. నిరాశతో కూడిన కొందరు నేత లు అరాచకత్వాన్ని వ్యాప్తి చేయాలని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది సిగ్గు చేటు. దీనిని ఖండించాలి. భారత్‌ శక్తిమంతమైన దేశం. దేశ నాయకుడు మోదీ అత్యంత శక్తిమంతమైన నేత. ఇక్కడ ఇటువంటి అరాచకత్వం కుదరదు’ అని హెచ్చరించారు. పాకిస్థాన్‌కు ప్రతినిధుల్లా మాట్లాడుతున్న వారికి ఇప్పుడైనా భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో పరిస్థితులేమిటో అర్థమై ఉండాలన్నారు. ఖుర్షీద్‌ వ్యాఖ్యలు దేశద్రోహం వంటివని బీజేపీకే చెందిన మరో నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేని కాంగ్రెస్‌.. దేశంలో బంగ్లాదేశ్‌ వంటి పరిస్థితులు ఏర్పడాలని కోరుకుంటోందా? అని బీజేపీ ఎంపీ సంబిత్‌ పాత్రా ప్రశ్నించారు.

అసదుద్దీన్‌ వర్సెస్‌ తృణమూల్‌ ఎంపీ జవహర్‌ సర్కార్‌

‘షిక్వా-ఎ-హింద్‌: భారతీయ ముస్లింల రాజకీయ భవిష్యత్తు’ పుస్తకావిష్కరణ సభలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ, చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఉంటే పరిస్థితిలో తేడా ఉండేదా? అని ప్రశ్నించారు. సమాజంలో ఉన్న భావోద్వేగాల ఆధారంగానే హిందూ మతతత్వం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాం గ్రెస్‌ ఎంపీ జవహర్‌ సర్కార్‌.. తమ పార్టీలో పలువురు ముస్లిం ఎంపీలు ఉన్నారని, లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో ఎంఐఎం పోటీ చేసి ఉంటే అన్ని సీట్లూ బీజేపీకే వెళ్లి ఉండేవన్నారు. దీనికి అసదుద్దీన్‌ స్పందిస్తూ.. సమస్య మీ మానసిక ధోరణి.. అంతేగానీ నేను కాదు అని తిప్పికొట్టారు.