తెలంగాణలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం

తెలంగాణలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం

గతేడాది ఇదే సమయానికి దాదాపు కోటి ఎకరాల్లో పంటలు.

ఈఏడాది ఇప్పటివరకు దాదాపు 84.59 లక్షల ఎకరాలకే పరిమితం.

15.30 లక్షల ఎకరాల మేర తగ్గిన సాగు.

ఈ వానాకాలంలో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా.. కానీ ఇప్పటి వరకు 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు.

పత్తిదీ అదే దారి.. 2.67 లక్షల ఎకరాలు తగ్గిన వైనం.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేకపోవడం.. చెరువులు నిండకపోవడమే కారణం!

రైతుభరోసా ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం ప్రభావం చూపిందంటున్న రైతు సంఘాలు..

రాష్ట్రమంతా వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం, చెరువులు, కుంటలు నిండకపోవడం, ఇటీవలి కాలం వరకు జలాశయాల్లో తగినంత నీరు లేకపోవడం..తదితర కారణాలతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేశిస్తున్నాయి. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి సాగైన పంటలతో పోలిస్తే, ఈసారి ఏకంగా 15.30 లక్షల ఎకరాల మేరకు సాగు తగ్గిపోయింది. ఈ వానాకాలం సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరుగుతుందని పంటల ప్రణాళికలో వ్యవసాయశాఖ అంచనా వేసింది.

అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. కానీ ఆశించిన స్థాయిలో సాగు జరగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం, రుణమాఫీకి ముందు పంట రుణాలు ఇవ్వకపోవడం వంటి కారణాలు కూడా సాగు తగ్గడానికి కారణాలుగా రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే కొందరు రైతులు భూముల్ని కౌలుకు ఇవ్వకుండా వదిలేశారన్న చర్చ కూడా జరుగుతోంది. కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే, తమకు రైతు భరోసా రాదని కొందరు రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

8.79 లక్షల ఎకరాల మేర తగ్గిన వరి గతేడాది వానాకాలం సీజన్‌ ఇదే సమయానికి అన్ని పంటలు కలిపి 99.89 లక్షల (దాదాపు కోటి) ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 84.59 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సాగు విస్తీర్ణం ఏకంగా 15.29 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి సాగు గణనీయంగా పడిపోయింది.

గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 34.37 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25.58 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. అంటే గతేడాదితో పోలిస్తే 8.79 లక్షల ఎకరాలు తగ్గింది. దీనిని బట్టి చూస్తే పంటల ప్రణాళిక ప్రకారం ఈ సీజన్‌లో 66 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యమయ్యేలా కని్పంచడం లేదు. వరికి రూ.500 బోనస్‌ కేవలం సన్నాలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం, ఆ వరి రకాల పేర్లను మొన్నమొన్నటి వరకు బహిరంగపరచకపోవడం, ఇప్పుడు వాటిని రైతులకు అందుబాటులో ఉంచకపోవడం తదితర కారణాలు ఏమైనా రైతులను గందరగోళపరిచాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతేడాది వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవడం గమనార్హం.

పత్తి సాగూ తగ్గింది..

పత్తి విషయానికొస్తే.. గతేడాది ఇదే సమయానికి 44.32 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి కేవలం 41.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే 2.67 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందన్నమాట. వాస్తవానికి పత్తి సాగును 60 లక్షల ఎకరాలకు పెంచాలని, వీలైతే 70 లక్షల ఎకరాలకు పెంచినా మంచిదేనన్న అభిప్రాయంతో వ్యవసాయ శాఖ ఉంది. ఆ మేరకు ప్రణాళికలు వేసుకుంది.

కానీ కీలకమైన సమయంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలమైంది. అనేకమంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గతేడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో రైతులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయారని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ఇక గతేడాదితో పోలిస్తే మొక్కజొన్న సాగు 93,635 ఎకరాల్లో, కంది 35,176 ఎకరాల్లో, సోయాబీన్‌ 72,744 ఎకరాల్లో తగ్గింది.

వనపర్తి జిల్లాలో 20.59 శాతమే సాగు రాష్ట్రంలో అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో 20.59 శాతమే పంటలు సాగయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 32.02 శాతం, ములుగు జిల్లాలో 32.57 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 41.67 శాతం, రంగారెడ్డి జిల్లాలో 44.89 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యంత ఎక్కువగా పంటల సాగు నమోదు కావడం గమనార్హం. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5,62,098 ఎకరాలు కాగా, 5,63,481 ఎకరాల్లో సాగైంది.

జిల్లాల వారీగా వరి, పత్తి సాగు ఇలా..

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకోలేదు. నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 2.54 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 79,085 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 1.87 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, 97,087 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతేడాది 2.21 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.50 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మెదక్‌ జిల్లాలో గతేడాది 2.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడగా, ఇప్పుడు కేవలం 1.22 లక్షల ఎకరాల్లోనే పడ్డాయి.

ఇదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, మహబూబాబాద్, భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో నాట్లు గణనీయంగా తగ్గాయి. ఇక పత్తి నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 5.86 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది ఇప్పటివరకు 5.22 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గతేడాది 2.41 లక్షల ఎకరాల్లో సాగైతే, ఇప్పుడు 1.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నారాయణపేట జిల్లాలో గతేడాది 2.02 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు 1.65 లక్షల ఎకరాలకే పరిమితమైంది. జనగామలో గతేడాది ఇదే సమయానికి 1.35 లక్షల ఎకరాల్లో సాగవగా, ఇప్పుడు కేవలం 97,225 ఎకరాల్లోనే సాగైంది. సంగారెడ్డి, పెద్దపల్లి, నిర్మల్‌ తదితర జిల్లాల్లోనూ పత్తి సాగు తగ్గింది.

వర్షాల కోసం చూస్తున్నా..

నాకు నాలుగున్నర ఎకరాల సొంత పొలం ఉంది. ఏటా మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటా. నాలుగున్నర ఎకరాల్లో మెట్ట పంటలు వేసి మిగతా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తా. అయితే ముసురు వర్షాలకు కారణంగా ఇప్పటివరకు మూడెకరాల్లోనే వరి నాట్లు వేశా. మిగిలిన 17 ఎకరాల సాగుపై ఎటూ తోచడం లేదు. ప్రస్తుతానికైతే మరో పదెకరాల వరకు నారుమడి సిద్ధం చేసుకున్నా. కానీ ఇదే పరిస్థితి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటే వేసిన మూడెకరాల వరి కూడా పండదు. అందుకే భారీ వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. – మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా

15,131చెరువులు ఖాళీ…

రాష్ట్రంలో 34,716 చెరువులు, కుంటలున్నాయి. అందులో 3,247 చెరువులు ఇటీవలి వర్షాలతో అలుగు పోస్తున్నాయి. 6,735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. 3,438 చెరువుల్లో 50 నుంచి 75% నీటి నిల్వలున్నాయి. 6,165 చెరువుల్లో మాత్రం 25 నుంచి 50% మాత్రమే నీరు చేరింది. 15,131 చెరువుల్లో నీటి నిల్వలు ఇంకా 25% లోపలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 61.34 శాతం చెరువుల్లో 50% కంటే తక్కువగానే నీటినిల్వలున్నాయి.