కాంగ్రెస్ వైపు జగన్ చూపు… షర్మిల గేమ్ ప్లాన్ షురూ.
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమితో జత కట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనతో తీవ్ర ఇబ్బందులు పడిన ఏపీ జనం తెలుగుదేశం కూటమికి భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రెండు నెలల కాలంలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండటంతో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు.
మరో వైపు అధికారంలోఉన్న సమయంలో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి చట్టపరంగా శిక్షించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలు కెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ దందా వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో ఆయన అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో త్వరలో జోగి రమేశ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోవల్లభనేని వంశీ.. ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై పదకొండు కేసుల్లో సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు జగన్ మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ.. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా జగన్ కు దూరమవుతున్నారు అధికారం కోల్పోయిన తరువాత అన్నివైపుల నుంచి ముప్పు తరుముకొస్తుండటంతో జగన్ అలర్ట్ అవుతున్నారు. ఎన్డీయే కూటమి వైపుకు వెళ్లేందుకు ద్వారాలు మూసుకుపోవడంతో ఇండియా కూటమిలో చేరితే కాస్తయినా జాతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో జగన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ద్వారా ఇండియా కూటమిలో భాగస్వామి అయ్యేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయన తరచూ బెంగళూరు వెళ్తున్నారు. ఇటీవల బెంగళూరు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జగన్ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
వారం రోజుల కిందట బెంగళూరులో రాహుల్ గాంధీతో జగన్ రహస్యంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేయడం కాకుండా ఇండియా కూటమిలో చేరతామని రాహుల్ తో జగన్ చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కానీ, రాహుల్ గాంధీ మాత్రం వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే నీకు రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుందని సూచన చేసినట్లు సమాచారం. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతెమ్మ కోర్కెలు కోరగా, రాహుల్ గాంధీ వాటికి నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయి, ఇప్పుడిలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా జగన్ తో అన్నట్టు సమాచారం. సమయం తీసుకొని మీ అభిప్రాయం చెప్పాలని జగన్ మోహన్ రెడ్డికి రాహుల్ సూచించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండటంలో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల అలర్ట్ అయ్యారు.
ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్ ను అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల తీరుతో ఇప్పటికే ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్ల తెలుస్తోంది. వారికి చెక్ పెట్టడంతో పాటు.. ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీతో జత కలిసినా, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలో తన వర్గాన్ని బలోపేతం చేయడంపై ఆమె దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో తనకు అనుకూలంగా ఉండే నేతలకు షర్మిల ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది.. ఆసమావేశంలో పాల్గొనేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో తాను సూచించిన వ్యక్తులకు చోటు కల్పించాలంటూ ఏఐసీసీ నేతలకు ఆ సందర్భంగా షర్మిల పెద్ద జాబితానే సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పూర్తిగా తనకు మద్దతుదారులుగా ఉన్న నేతల పేర్లే షర్మిల పొందుపరిచారని సమాచారం. తన అనుకూల వర్గానికి పార్టీ పదవులు ఇప్పించుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీలో తన పట్టు చేజారిపోకుండా షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.