మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు… రాష్ట్రాలు సీరియస్​గా తీసుకోవాలి: ప్రధాని మోదీ

మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు… రాష్ట్రాలు సీరియస్​గా తీసుకోవాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :

మహిళలపై నేరాలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళలపై నేరాల ఘటనలను వీలైనంత త్వరగా విచారించాలని, అఘాయిత్యాలకు పాల్పడిన వారిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని సూచించారు. స్వాంత్రత్య సమరయోధులకు, దేశం కోసం ధైర్యంగా, కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న సైనికులు, రైతులు, యువత అందరికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోటపై గురువారం మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ప్రధాని హోదాలో ఆయన వరుసగా 11వసారి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రధాని 98 నిమిషాలపాటు రికార్డు స్థాయిలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. కోల్‌‌కతాలో ట్రైనీ డాక్టర్​పై లైంగికదాడిపైనా ఆయన స్పందించారు. ‘‘ఎయిర్​ఫోర్స్​, ఆర్మీ, నేవీ, స్పేస్​ ఇలా అనేక రంగాల్లో మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. కానీ కొన్ని ఆందోళనకర అంశాలు కూడా ఉన్నాయి. ఈ ఎర్రకోట సాక్షిగా నేడు నా బాధను వ్యక్తంచేస్తున్నా. మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న పైశాచిక దాడులపై జనం ఆగ్రహంతో ఉన్నారు. వారి బాధను నేను అర్థం చేసుకున్నా. దేశం, సమాజం, మన రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై నేరాలను సీరియస్‌‌గా తీసుకోవాలి” అని పేర్కొన్నారు. నేరం చేయాలంటేనే భయపడేలా శిక్షలపై విస్తృత ప్రచారం జరగాలని మోదీ పేర్కొన్నారు.