CM పీఠం పై డి.కె.శివకుమార్ కన్ను

CM పీఠం పై డి.కె.శివకుమార్ కన్ను

వరుస స్కామ్‌లతో సిద్ధరామయ్య ఉక్కిరిబిక్కిరి… CM పదవిపై అనాసక్తి

తెరవెనుక వేగంగా మంత్రాంగం

మంత్రి సతీశ్‌ జార్కిహోళితో భేటీ

మద్దతు ప్రకటించాలంటూ అభ్యర్థన

డీకేకు మద్దతుపై జార్కిహోళి విముఖత

సీఎం పదవిపై ఆసక్తితో ఉండటమే కారణం

పరమేశ్వర, ఖర్గే పేర్లను పరిశీలిస్తున్న అధిష్ఠానం

కర్ణాటకలో కుర్చీలాట మొదలైంది. సీఎం సిద్ధరామయ్య మెడకు ముడా స్కామ్‌ చుట్టుకుంటున్నది. ఇదే అదనుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ పావులు కదపడం మొదలుపెట్టారు. 20 మంది ఎమ్మెల్యేల మద్దతున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సతీశ్‌ జార్కీహోళిని డీకే కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై జార్కీహోళి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో సీఎం పోస్టుకు గ్యారెంటీ ఉండదని అంటారు. చరిత్ర చెప్తున్న సత్యమిది. అధికారంలోకి వచ్చి 15 నెలలు కాకముందే కర్ణాటకలో మరోసారి సీఎం పదవి కోసం కుర్చీలాట మొదలైంది. సీఎం సిద్ధరామయ్య వరుస స్కామ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో కన్నడ రాజకీయం రసకందాయంలో పడింది. ఇదే అదునుగా సీఎం పోస్టు కోసం కీలక నేతలు తెరవెనుక మంత్రాంగాలు మొదలుపెట్టారు.

సిద్ధరామయ్య అనాసక్తితో ..

ముడా భూములు, వాల్మీకి కార్పొరేషన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ఇలా వరుస స్కామ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై అధిష్ఠానం బుజ్జగింపులకు ప్రయత్నించినా.. సిద్ధరామయ్య తిరస్కరిస్తున్నట్టు తెలుస్తున్నది. వెరసి కర్ణాటకలో సీఎం మార్పు త్వరలోనే జరుగనున్నట్టు సమాచారం. ఇదే అదునుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తెరవెనుక మంత్రాంగాన్ని ప్రారంభించారు. మంత్రి సతీశ్‌ జార్కిహోళితో సోమవారం రాత్రి 40 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు.

జార్కిహోళితోనే భేటీ ఎందుకు?

నిరుడు కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డీకే సీఎం అవుతారని భావించారు. అయితే, అధిష్ఠానం సిద్ధరామయ్యకు ఆ పదవిని కట్టబెట్టింది. దీనిపై డీకే వర్గం ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. కానీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకు ఉండటంతో ఇంతకాలం సీఎం మార్పు జరుగలేదు. ఇదే సమయంలో డీకేకు ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠానం కేటాయించింది. కాగా, సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోతే ఎవరు ఆ రేసులో ఉంటారన్న చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. సిద్ధరామయ్య తప్పుకుంటే, సీఎం పదవిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా మంత్రి జీ పరమేశ్వరకు కట్టబెట్టాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో డీకే.. ఉన్నపళంగా సోమవారం రాత్రి జార్కిహోళిని కలిశారు. ఒకవేళ, సీఎంగా తనను ప్రతిపాదించి మద్దతు ప్రకటిస్తే, కేపీసీసీ అధ్యక్ష పదవి వచ్చేలా తాను అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని జార్కిహోళికి డీకే ఆఫర్‌ ఇచ్చినట్టు తెలిసింది. కాగా, జార్కిహోళికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. కాబట్టే, జార్కిహోళిని డీకే కలిసినట్టు చెప్తున్నారు.

సీఎం పీఠంపై జార్కిహోళి ఆసక్తి

సీఎంగా డీకేకు జార్కిహోళి మద్దతు ప్రకటించకపోవడానికి బలమైన కారణం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. జార్కిహోళి వాల్మీకి(ఎస్టీ) వర్గానికి చెందిన బలమైన నేత. అధిష్ఠానం తనను సీఎంగా చేస్తుందన్న ఆకాంక్ష ఈయనలో ఉన్నది. గత నవంబర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘దళితులతో సహా అన్ని వర్గాల ప్రజలు తమ నేత సీఎం అవ్వాలని కోరుకొంటున్నారు.ఆ మేరకు డిమాండ్లు ఉన్నాయి. అయితే దానిపై పార్టీ హైకమాండే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాల్మీకి గురుపీఠ స్వామీజీ ప్రసన్నానంద నన్ను సీఎంగా చూడాలనుకొంటున్నట్టు పేర్కొన్న విషయం మీకు తెలిసిందే’ అని సీఎం పదవిపై తన ఆసక్తిని జార్కిహోళి పరోక్షంగా తెలియజేశారు. డీకే తీరుపై జార్కిహోళి గత కొంత కాలంగా అసంతృప్తితోనూ ఉన్నారు. ఈ క్రమంలోనే తనను సీఎం చేయడానికి మద్దతు ఇవ్వాలన్న డీకే అభ్యర్థనను జార్కిహోళి తిరస్కరించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.