పేదల కోసం పిచ్చెక్కించే స్కీం… జస్ట్ నమోదైతే చాలు ఎన్నో బెనిఫిట్స్…
పేదల కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థిక సాయం అందించేవి కొన్ని కాగా వృద్ధాప్యంలో అక్కరకు వచ్చే విధంగా మరికొన్నిటిని రూపొందించింది.
ఉద్యోగులకు వారి యజమానుల ద్వారా PF మరియు పెన్షన్ ఫండ్ సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. అయితే అసంఘటిత రంగంలో ఈ తరహా సౌకర్యాలు ఏవీ ఉండవు. అటువంటి వారిని ఆదుకునేందుకు కేంద్రం నడుం బిగించింది. ‘ఇ-శ్రమ్’ ద్వారా భరోసా ఇస్తోంది.
అసంఘటిత రంగంలోని కార్మికుల డేటాబేస్ క్రియేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లోనే ‘ఇ-శ్రమ్’ పోర్టల్‌ను ప్రారంభించింది. స్వీయ ధ్రువీకరణతో ఈ రంగంలో పనిచేసే ఏ కార్మికుడైనా ఇందులో నమోదై 12 అంకెల ఇ-శ్రమ్ కార్డ్ పొందవచ్చు. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన వారు దీన్ని పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.
పారిశ్రామిక రంగంలోని 30 విభాగాల్లో పనిచేస్తున్న వారితోపాటు 400 వృత్తుల్లో ఉన్నవారు ఈ కార్డు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పండ్ల వ్యాపారులు, వ్యవసాయ కూలీలు, పాడి రైతులు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులతోపాటు పలు ఇతర పనుల్లో నిమగ్నమయ్యే వారికి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. దీని కోసం కావాల్సిన అర్హత కేవలం సదరు వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
ఈ కార్డుదారులకు ప్రభుత్వం 2 లక్షల మేర వైద్య బీమా, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అటల్ పెన్షన్ యోజన కవరేజ్ ఇస్తుంది. 60 ఏళ్లు పైబడిన అనంతరం 3 వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉందని కార్మిక శాఖ చెబుతోంది. ఈ పథకానికి పూర్తి స్థాయిలో ప్రచారం లేకపోవడంతో దీని గురించి ప్రజల్లో అంతగా అవగాహన లేదు. అసంఘటిత రంగంలోని ఎంతోమంది పేదలకు దీన్ని గనుక చేరవేయగలిగితే వారి జీవన ప్రమాణాలు ఎంతో మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు.