కాసేపట్లో పెళ్లి… మటన్ కోసం లొల్లి… బంధువుల పరస్పర దాడుల్లో 8 మంది ఆసుపత్రిపాలు చిలికిచిలికి గాలివానలా మారిన మటన్ గొడవ
నవీపేట :
బలగం సినిమాలో నల్లిబొక్కల గొడవలాగే నిజ జీవితంలో ఓ ఘటన జరిగింది. అప్పటి వరకు వివాహ వేడుక కళకళలాడింది. వధూవరులను పెళ్లికి వచ్చిన అతిథులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ‘ మొదలైంది ‘ముక్కల’ లొల్లి. భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండలంలోని బాద్గుణకు చెందిన వ రుడితో పెళ్లి జరిగింది. తర్వాత జరిగిన పెళ్లి భోజనంలో తమకు మటన్, చికెన్ సరిగ్గా వడ్డించడం లేదని వరుడి తరఫు బంధువులు గొడవకు దిగారు. ముక్కలు తక్కువగా వేస్తున్నారంటూ పెళ్లి కూతురు తరపు బంధువులతో వాదనకు దిగారు. చిన్నగా మొదలైన గొడవ కాస్త ఒక్కసారిగా పెద్దగా మారింది. దీంతో అటు వధువు, ఇటు వరుడు తరఫు చెందిన వారు ఒకరినొకరు పిడిగుద్దులు కురి పించుకున్నారు.
దొరికిన వాటితో దొరికినట్లుగా..
అంతటితో ఆగకుండా వంట గంటెలు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట నవీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఫంక్షన్ హాల్ బయట ఉన్న రోడ్డుపై సైతం ఇరు పక్షాలు దాడులు చేసుకుని న్యూసెన్స్ చేయడంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు.